Share News

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో 4 కారిడార్లకు జీసీల నియామకం

ABN , Publish Date - Oct 13 , 2026 | 10:35 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో మెట్రో రెండో దశ విస్తరణ పనుల్లో వేగంగా అడుగులు పడుతున్నాయి.

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో 4 కారిడార్లకు జీసీల నియామకం
Hyderabad Metro Rail

  • మెట్రో రెండోదశ పనుల్లో వేగంగా అడుగులు

  • జీసీల నియామకానికి ఆహ్వానం

  • నిర్మాణ సమయంలో తలెత్తే సమస్యలపై సలహాలు, సూచనల వెల్లడి

  • 22 వరకు టెండర్ల దాఖలు

  • ఓల్డ్‌సిటీలో ఇంకా 55 ఆస్తుల సేకరణ పెండింగ్‌

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో మెట్రో రెండో దశ విస్తరణ పనుల్లో వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టులో మొత్తం 7 కారిడార్లలో 122.9 కి.మీ. మేర పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు రూ.38,595 కోట్లను కేటాయించారు. అయితే, ఇందులో నాలుగు మార్గాలకు సంబంధించిన పనుల పర్యవేక్షణ కోసం జనరల్‌ కన్సల్టెన్సీ(జీసీ)ల ఏర్పాటుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


జీసీల పని విధానం..

టెండర్‌లో ఎంపికైన జనరల్‌ కన్సల్టెంట్‌ (జీసీ) రోజువారీగా అథారిటీ, సంబంధిత కాంట్రాక్టర్లు, ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఇతర సంస్థలతో నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే సమాచారం, డిజైన్‌ డాక్యుమెంటేషన్‌, పని ప్రవాహాలను నిర్వహించాలి. ప్రధానంగా నిర్మాణ సమయంలో తలెత్తే సమస్యలపై సలహాలు, సూచనలు అధికారులకు అందించాలి. జీసీ తన సేవల పరిధిలోకి వచ్చే అన్ని విషయాలపై హెచ్‌ఏఎంఎల్‌ ఆమోదాన్ని పొందాలి. నియామకమైన జీసీ మూడు నెలల్లోగా తాను తయారు చేసిన డిజైన్‌ ప్రతిపాదనలను అందించాల్సి ఉంటుంది.


ఓల్డ్‌సిటీలో 55 ఆస్తుల పెండింగ్‌..!

ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న ఓల్డ్‌సిటీ కారిడార్‌లో దారుల్‌షిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు రోడ్డుకు రెండు వైపులా 100 మీటర్ల చొప్పున ఆస్తులు అవసరపడుతున్నట్లు గతంలో అధికారులు ప్రకటించారు. తొలుత 1,400 ఆస్తులు కావాలని భావించినప్పటికీ.. అలైన్‌మెంట్‌లో మార్పుల కారణంగా 888కు కుదించారు. ఇందు లో ఇప్పటివరకు 833 ఆస్తులను సేకరించారు. మిగిలిన 55 ఆస్తులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ కారిడార్‌లో తొలగించిన ఒక చెట్టుకు బదులు ఇతర ప్రాంతంలో 6 చెట్లు నాటాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు మెట్రోవర్గాలు తెలిపాయి.


city6.2.jpgసెకండ్‌ ఫేజ్‌లోని రాయదుర్గం- కోకాపేట్‌ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ (7.1 కి.మీ.), మియాపూర్‌-పటాన్‌చెరు (13.4 కి.మీ.) పనులకు సంబంధించిన జీసీల నియామకానికి రెండు నెలల క్రితం టెండర్లు పిలిచారు. గతనెల 19వరకు చివరి గడువు పెట్టారు. అయితే ఆయా సంస్థలు తక్కువకు కోట్‌ చేయకపోవడంతో గడువును మళ్లీ ఈనెల 22 వరకు పెంచారు. మొత్తం ప్రతిపాదిత 7 కారిడార్లలో తొలుత నాలుగు కారిడార్లకు సంబంధించిన జీసీల నియామకం పూర్తయితే పనుల్లో కాస్త ముందుకుసాగవచ్చని అధికారులు చెబుతున్నారు.


క్యూసీబీఎస్‌ ఆధారంగా ఎంపిక

ప్రీ బిడ్‌ టెండర్లలో పాల్గొన్న కంపెనీలను క్వాలిటీ కమ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ (క్యూసీబీఎస్‌) ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆయా సంస్థలు గతంలో చేసిన పనుల్లో క్వాలిటీ, వారంటీ, నిర్మాణంలో వినియోగించే ఇనుము, ఇతర ముడి వస్తువులను ఇందులో పరీక్షిస్తారు. అలాగే కంపెనీలు సమర్పించిన ఫొటోలు, డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. వారు చేసిన పనులను క్షేత్ర స్థాయిలో సందర్శించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోనున్నారు. పనుల్లో చేపట్టే నాణ్యతతోపాటు టెండర్‌ వేసిన మొత్తాన్ని చూసిన తర్వాత అన్ని అర్హతలనూ బట్టి ఒక సంస్థకు బాధ్యతలను అప్పగించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 10:35 AM