భారత్ జీడీపీ వృద్ధి 7 శాతం.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్..
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:56 AM
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం, పెరుగుతున్న చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం, పెరుగుతున్న చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గతంలో ప్రకటించిన 6.4 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. 2027-28 ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు 7 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది (India GDP Growth).
దేశీయంగా డిమాండ్ పటిష్ఠంగా ఉండటం, సేవల రంగంలో కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగడం దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది. గతంలో భారత ఆర్థిక వ్యవస్థ 2026–27లో 6.4 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. తాజాగా ఈ అంచనాను 0.6 శాతం పాయింట్లు పెంచి 7 శాతానికి చేర్చింది. అంతకుముందు అంచనాలతో పోలిస్తే భారత ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగుతుండటం ఈ మార్పునకు కారణమైందని ఐఎంఎఫ్ పేర్కొంది (IMF Growth Forecast).
దేశీయ వినియోగం బలంగా ఉండటం, సేవల రంగం వృద్ధి, విస్తరిస్తున్న దేశీయ మార్కెట్ భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది (Indian Economy 2026-27). అనుకూలమైన జనాభా నిర్మాణం, నిర్మాణాత్మక సంస్కరణలు కూడా మధ్యకాలిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని అంచనా వేసింది. ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తత అవసరమని సూచించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. 2027-28లో ఇది 4.4 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. 2027 ప్రపంచకప్‌లో అసలైన బలం ఇదే: మహమ్మద్ కైఫ్
ప్రతిపక్ష కూటమి పిటిషన్‌లో 14 లోపాలు.. కోర్టు ఫీజులో రూ.220 తక్కువగా చెల్లింపు..