ఎన్నికల అఫిడవిట్‌తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:21 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర్పించిన అధికారిక ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఆయన ఆస్తుల వృద్ధిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల అఫిడవిట్లు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర్పించిన అధికారిక ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఆయన ఆస్తుల వృద్ధిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనకు ఒక్క ఎకరం భూమీ లేదని కేసీఆర్ పేర్కొ్న్నారు. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో.. ఆ తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములు, ఆస్తులు ఊహించని రీతిలో పెరిగాయని రికార్డుల ద్వారా తెలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
'తనకు ఒక్క ఎకరం కూడా భూమిలేదని 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసీఆర్‌కు, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి? తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్‌కు భూములు భారీగా పెరిగిన విషయం.. స్వయంగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి. కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి.? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా.! ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం.. పుట్టుకతోనే కేసీఆర్‌కు వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు' అని పొంగులేటి 'ఎక్స్'లో రాసుకొచ్చారు. ఈ విషయమై ఎన్నికల అఫిడవిట్లో తప్పులు రాసి మోసం చేశారా? లేక ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారా.? అని @KTRBRSను ట్యాగ్ చేస్తూ నిలదీశారు.
ఇవీ చదవండి:
ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ
‘సెమీకాన్ ఇండియా-2026’కు ప్రధాని మోదీ శ్రీకారం