Share News

ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:24 PM

తన జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అందుతున్న శుభాకాంక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజల ఆశీస్సులే తనను దేశసేవ వైపు నడిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా అందుతున్న విషెష్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ చేపట్టిన ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రేమాభిమానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఆశీర్వాదాలు దేశసేవ పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పుకొచ్చారు.


మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని గాయని స్నేహా శంకర్, కళాకారుడు అమన్‌ పంత్ రూపొందించిన ‘ఆశీర్వాద్ కా దియా’ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. మోదీ జన్మ దినంతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తుచేస్తూ ఈ పాటను అంకితం చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని.. తనకు లభిస్తున్న ప్రజల ఆశీర్వాదాలు దేశానికి సేవ చేయాలన్న తన నిబద్ధతను మరింత పెంచుతాయని పేర్కొన్నారు.


కాగా.. మోదీ బర్త్‌డే సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ప్రజలు ‘ఆశీర్వాద్ కా దియా(ఆశీర్వాద దీపం)’ కార్యక్రమం చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఇళ్లలో దీపాలు వెలిగించి మోదీ ఆయురారోగ్యాలు, విజయాన్ని ఆకాంక్షించాలని పార్టీ జాతీయధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విజ్ఞప్తి చేశారు. తానూ ఆశీర్వాద దీపం వెలిగిస్తానన్న ఆయన.. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవే దేశసేవ అన్న సూత్రంతో మోదీ పనిచేస్తున్నారని నితిన్‌ నబీన్‌ పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే కొత్త విధానాలు, కార్యక్రమాలు, పథకాలను తీసుకొచ్చారన్నారు.


ఇక మోదీ పుట్టినరోజు సందర్భంగా ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ పేరుతో నెల రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది బీజేపీ. నేటి నుంచి అక్టోబరు 17 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రక్తదాన శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రదర్శనలు, సదస్సులు, ప్రజా సంబంధ కార్యక్రమాలు వంటివి ఇందులో భాగం కానున్నాయి.


ఇవీ చదవండి:

మోదీ.. మోస్ట్‌ ఫాలోవ్డ్!.. సోషల్‌ మీడియాలో 'జన్‌ జెడ్‌' జోరు

దేశవ్యాప్తంగా ఘనంగా పీఎం మోదీ జన్మదిన వేడుకలు

Updated Date - Sep 17 , 2026 | 12:24 PM