మోదీ.. మోస్ట్ ఫాలోవ్డ్!.. సోషల్ మీడియాలో 'జన్ జెడ్' జోరు
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:09 AM
సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ప్రపంచ నేతల్లో భారత ప్రధాని ఒకరు. నేడు నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్, యూత్‌లో ఆయనకున్న క్రేజ్‌ను ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: రాజకీయ నాయకుల ప్రచారానికి ఒకప్పుడు సభలు, సమావేశాలు.. ఆ తర్వాత టీవీలు, పత్రికలు ప్రధాన వేదికలుగా ఉండేవి. కానీ నేడు ఒక్క స్మార్ట్‌ఫోన్ నుంచే కోట్లాది మందిని చేరుకునే అవకాశం సామాజిక మాధ్యమాలకు వచ్చేసింది. అయితే.. ఈ మార్పును విస్తృత స్థాయిలో వినియోగించుకుంటున్న ప్రపంచ నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారు. నేడు మోదీ బర్త్‌డే సందర్భంగా.. ఆయన సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై ప్రత్యేక కథనం..
సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. 2026 సెప్టెంబర్ నాటికి ఎక్స్‌లో ఆయనకు 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే అంటే 2024లోనే ఆయనీ మైలురాయిని అధిగమించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్ను 106 మిలియన్ల మంది అనుసరిస్తుండగా.. గత ఫిబ్రవరిలోనే ఈ సంఖ్య 106 మిలియన్లకు చేరడంతో.. ఈ ఘనత దక్కించుకున్న తొలి ప్రపంచ నేతగా గుర్తింపు పొందారు మోదీ. ఇక యూట్యూబ్ విషయానికొస్తే.. ఈ ఏడాది మార్చిలో ఆయన అధికారిక యూట్యూబ్ ఛానల్ 30 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను దాటింది. ప్రపంచ నేతలకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లలో అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న ఛానల్‌గా మోదీ ఛానల్ నిలిచింది. ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్.. ఇలా పలు వేదికలను మోదీ తన డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఉపయోగిస్తున్నారు.
మోదీ సోషల్ మీడియా వ్యూహంలో మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్.. అదే 'జన్ జెడ్' యూత్ ఆకట్టుకోవడం. విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలపై ఆయన నేరుగా స్పందిస్తుంటారు. రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం సహా వ్యక్తిగత విషయాలు, పర్యటనల దృశ్యాలు, ఫొటోలు, షార్ట్ వీడియోలు, రీల్స్ వంటివన్నీ ఆయన ఖాతాల్లో కనిపిస్తుంటాయి. ఇన్‌స్టాలో ముఖ్యంగా షార్ట్ వీడియోలు, ట్రెండింగ్ మ్యూజిక్, పాప్ కల్చర్ టాపిక్స్, విజువల్ కంటెంట్ బేస్డ్ మెసేజ్లను అందించే ప్రయత్నం చేస్తుంటారు. గత నెలలో మంత్రులు కూడా ఇన్‌స్టాలో చురుగ్గా ఉండాలని, యువతతో రీల్స్ ద్వారా మమేకం కావాలని సూచించడం విశేషం.
ఓవరాల్‌గా మోదీ సోషల్ మీడియా ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వ కార్యక్రమాలు, విధాన ప్రకటనలను తెలిపే వేదికగానే కాకుండా.. ఫొటో, వీడియో, రీల్, లైవ్ ఇలా ఆయా రూపాల్లో ప్రజలతో నేరుగా మమేకమయ్యే సాధనంగా మారింది.
ఇవీ చదవండి:
లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడంటూ యూపీలో ఓ ఉపాధ్యాయుడి కాల్చివేత
గతేడాది ఒక్క రాయి దాడి కూడా లేదు.. జమ్మూకశ్మీర్‌పై రక్షణ శాఖ ఆసక్తికర నివేదిక..