‘సెమీకాన్ ఇండియా-2026’కు ప్రధాని మోదీ శ్రీకారం
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:38 PM
దేశీయ సెమీకండక్టర్ తయారీకి మరింత ఊతమిచ్చేలా కీలక ముందడుగు వేసింది భారత్. సెమీకాన్ ఇండియా-2026లో భాగంగా.. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోని రెండు ప్లాంట్లలో వాణిజ్య ఉత్పత్తిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ సెమీకండక్టర్ తయారీకి మరింత ఊతమిచ్చేలా కీలక ముందడుగు వేసింది భారత్. సెమీకాన్ ఇండియా-2026 సదస్సులో భాగంగా.. పంజాబ్‌లోని మొహాలీ సీడీఐఎల్ సెమీకండక్టర్ ఏటీఎంపీ ప్లాంట్, గుజరాత్‌లోని పల్సానా సుచీ సెమీకాన్ ఓశాట్ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఏజెంటిక్ ఏఐ, టోకెనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సమ్మిళిత ఆర్థిక సేవలపై చర్చలు జరిగాయన్నారు. దేశంలో సుమారు 3వేల కిలోమీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ భారత్ 7.8 శాతం త్రైమాసిక వృద్ధిరేటును సాధించిందని పేర్కొన్నారు.
'సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ద ఎకోసిస్టమ్' అనే థీమ్‌తో సెమీకాన్ ఇండియా-2026 కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. సెమీకండక్టర్ రంగానికి చెందిన అంతర్జాతీయ, భారతీయ కంపెనీలు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సెమీకండక్టర్ తయారీలో అవసరమైన ముడి పదార్థాలు, పరికరాలు, చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్, సిస్టమ్స్ వరకు మొత్తం ప్రక్రియనంతా ఒకే వేదికపై ప్రదర్శిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు, ప్రదర్శనలో 600కుపైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. సుమారు 50 వేల మంది సందర్శకులు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో.. 52 దేశాలకు చెందిన ప్రతినిధులు, 400కుపైగా ఎగ్జిక్యూటివ్‌లు, 150 మందికి పైగా వక్తలున్నారు.
కాగా.. సెమీకండక్టర్ రంగంలోని మొత్తం వాల్యూ చైన్‌ను ప్రజలకు పరిచయం చేసేందుకు ‘శాండ్ టూ సిలికాన్ టూ సిస్టమ్స్’ పేరిట స్పెషల్ ఎక్స్పీరియన్స్ షోను ఏర్పాటుచేశారు. ఇసుక నుంచి సిలికాన్ తయారీ, అక్కడి నుంచి చిప్, చివరకు ఎలక్ట్రానిక్ వ్యవస్థగా మారే ప్రక్రియను ఇందులో చూపిస్తున్నారు. ఇందుకోసం జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు చెందిన 6 ప్రత్యేక పెవీలియన్లను ఏర్పాటుచేశారు. 12 రాష్ట్రాల బూత్‌లతో పాటు స్టార్టప్ పెవీలియన్, ఇన్నోవేషన్ షోకేస్, విద్యార్థుల హ్యాకథాన్, నైపుణ్యాభివృద్ధి పెవీలియన్‌నూ ఏర్పాటుచేశారు. చిప్‌ల తయారీ నుంచి వాటి ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పన వరకు సెమీకండక్టర్ తయారీలో దేశీయ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇవి కీలకపాత్ర పోషించనున్నాయి. దేశంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సాంకేతిక భాగస్వామ్యాలు, మానవ వనరుల అభివృద్ధికి ఈ సదస్సు వేదికగా నిలుస్తోంది.
ఇవీ చదవండి:
మోదీ.. మోస్ట్ ఫాలోవ్డ్!.. సోషల్ మీడియాలో 'జన్ జెడ్' జోరు
దేశవ్యాప్తంగా ఘనంగా పీఎం మోదీ జన్మదిన వేడుకలు