Share News

నేటినుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు

ABN , Publish Date - Nov 19 , 2026 | 09:36 AM

కుటుంబ పెద్దకు ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని ప్రభుత్వం భావించింది.

నేటినుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు
Indiramma Family Insurance

  • జంట సర్కిళ్లలోని15వార్డు కార్యాలయాల్లో ఆపరేటర్లు

  • 18-59 ఏళ్ల వయసున్న వారికి రూ.5లక్షల బీమా కవరేజ్‌

  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా- ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ

హైదరాబాద్: కుటుంబ పెద్దకు ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని ప్రభుత్వం భావించింది. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5లక్షల కవర్‌ ఉండేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుడుతోంది. దీంతో ఈనెల 19వ తేదీ నుంచి సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూకట్‌పల్లి, మూసాపేట్‌ సర్కిళ్ల పరిధిలోని 15వార్డుల్లో ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించి నమోదు ప్రక్రియ చేపట్టాలని డీసీలు కిందిస్థాయి ఉద్యోగులకు బుధవారం దిశానిర్దేశం చేశారు.


జంట సర్కిళ్ల పరిధిలో నమోదు ప్రక్రియ

కూకట్‌పల్లి సర్కిల్‌లో ఆరు, మూసాపేట్‌ సర్కిల్‌లో ఐదు వార్డుల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఫుడ్‌సేప్టీ కార్డు ఉన్నా ఇక్కడ నమోదు చేసుకునేందుకు వస్తే వారి పేర్లు నమోదు చేయాల్సిందే అన్నారు. మా వార్డు, మా సర్కిల్‌ కాదు అని తిరస్కరించకుండా ఉండాలని, ఏఎంసీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా దిశానిర్దేశం చేశారు. సర్కిల్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వార్డు కార్యాలయాల్లో నియమించుకోండి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలుత కుటుంబ సభ్యుల జాబితా ఎంత మంది పేర్లు ఉంటే అందరివి యాడ్‌ చేయండి.. ఆ తర్వాత ఎవరి పేరు మీద బీమా కవరేజ్‌ కావాలో వారిని అడిగి తెలుసుకోండి.


ఆ తర్వాత నామినీ విషయంలో ఎంత పర్సంటేజీ అన్నది కూడా ఆ కుటుంబ సభ్యులను అడిగి వారి ఒప్పందం మేరకు వివరాలు ఇవ్వాలి. రేషన్‌ కార్డుతో పాటు కుటుంబ ఆధార్‌ కార్డులు తెచ్చుకుంటే నమోదు చేస్తారు. పేర్లు, పుట్టిన తేదీలు, రిలేషన్‌ వంటి వాటిపై కంప్యూటర్‌లో నమోదు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య, భర్త ఇద్దరూ సంపాదించే వారు అయితే మీలో ఎవరికి కవరేజ్‌ ఇవ్వమంటే వారికే ఇవ్వడం జరుగుతుంది. నామినీ విషయంలో భార్య, భర్త, పిల్లలు ఇలా ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఒకరికంటే ఎక్కువ మంది నామినీలుగా కూడా ఎంచుకోవడంతో పాటు పర్సంటేజీ కూడా రాయాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డులో లేని పిల్లల పేర్లు కూడా కుటుంబ బీమా జాబితాలో యాడ్‌ చేయవచ్చు. బీమా ఉన్న వ్యక్తి యాక్సిడెంట్‌ వల్లనే కాదు.. సాదారణ జబ్బుతో చనిపోయినా నామినీకి బీమా సొమ్ము అందజేయడం జరుగుతుంది. నవంబరు 19న ప్రారంభమై డిసెంబరు 18న ముగుస్తుంది.


zz.jpgసీఎంసీ వార్డు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు మీసేవ కేంద్రాల్లో కూడా నమోదు ప్రక్రియ ఉంది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉంటున్న ప్రజలు సొంత ఊర్లకు వెళ్లాల్సిన పనిలేదు. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడకు వెళ్లి బీమా కోసం పేర్లు నమోదు చేయించుకొని రసీదు తీసుకోండి. సివిల్‌ సప్లై అధికారుల వద్ద ఉన్న కుటుంబాల అందరికీ ఇది వర్తిస్తుంది. కులం, మతం, ప్రాంతం లేకుండా రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న కుటుంబాలకు బీమాకు పేర్లు నమోదు చేయండి. మీ సొంత నిర్ణయం కాకుండా మీ వద్దకు దరఖాస్తుదారులు వచ్చినప్పుడు వారు చెప్పిన ప్రకారం చేయాలి. డాక్యుమెంట్లు లేవని తిరస్కరించకుండా పేర్లు, వివరాలు చెబితే వాటిని కంప్యూటర్‌లో నమోదు చేయండి. రేషన్‌ కార్డులో ఉన్న వాటినే ఎంచుకోవాలనే నిబంధనేమి లేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం బీపీఎల్‌ కుటుంబాలకు జీవిత బీమా వర్తించేలా చూడటమే మన ముందున్న లక్ష్యం.


ఆపరేటర్లు, అదనపు సిబ్బంది అవసరం అయితే చెప్పండి ఆ మేరకు సర్దుబాటు చేస్తామని డీసీలు ఏఎంసీలకు హామీ ఇచ్చారు. కానీ ఒక్క రోజు కూడా లీవ్‌ లేకుండా ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆపరేటర్లు పనిచేయాలి. ఏ ఒక్క దరఖాస్తుదారున్ని తిరస్కరించకూడదు. ఆ కుటుంబంలో ఏ ఒక్కరు వచ్చినా వివరాలు నమోదు చేసి జీవిత బీమా రసీదు ఇవ్వాలి. ఒక్కో వార్డుకు కంప్యూటర్‌, ప్రింటర్‌ సమకూరుస్తాం. ఒక ప్రింట్‌ రేషన్‌ కార్డు సభ్యులకు, ఒకటి మన వద్ద ఉండేలా చూసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం, బీమా కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తీసుకోవడంలో వెనుకాడే ప్రసక్తే లేదు. సమస్య ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి.. సేవల్లో లోపాలు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.


అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాకు పేర్లు నమోదు చేసుకోవాలి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మీకు దగ్గరలో ఉన్న వార్డు కార్యాలయాల్లో మీ వివరాలు ఇచ్చి పేర్లు నమోదు చేసుకుంటే అనుకోకుండా ఏదేని కారణం వల్ల ఆ వ్యక్తి చనిపోతే రూ.5లక్షల జీవిత బీ మా నామినీకి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఉచిత నమోదుతో పాటు ఇన్సూరెన్స్‌కు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తరఫున ప్రభుత్వం చెల్లిస్తుంది. పేదలు, దిగువ మధ్యతరగతి కటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలు పరుస్తోంది. ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉంటే నేరుగా సర్కిల్‌ కార్యాలయాల్లో మాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.

  • ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు కూకట్‌పల్లి, మూసాపేట్‌ సర్కిల్స్‌


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రతి కుటుంబానికి బీమా.. అందరికీ ధీమా

నీటి పొదుపుపై పాఠశాలల్లో పాఠాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 09:44 AM