మధ్యప్రదేశ్‌లో బోల్తాపడ్డ ఆయిల్ ట్యాంకర్.. నూనె కోసం ఎగబడిన జనం
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:28 AM
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. దేవాస్ బైపాస్‌పై పామాయిల్ లోడ్‌తో ఉన్న భారీ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. దేవాస్ బైపాస్‌పై పామాయిల్ లోడ్‌తో ఉన్న భారీ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. అయితే ప్రమాదం కారణంగా ఆయిల్ లీకేజీ మొదలైంది. టన్నుల కొద్ది నూనె ఒలికిపోయింది. అక్కడితో అయిపోలేదీ కథ. ఆయిల్ ట్యాంకర్ బోల్తా వార్తలు తెలుసుకున్న కొందరు.. ఉచితంగా దొరుకుతున్న నూనె కోసం ఎగబడ్డారు. పురుషులు, మహిళలు గుంపులు గుంపులుగా ఘటనా స్థలికి చేరుకున్నారు. వారి వెంటే పెద్ద పెద్ద టిన్లు, బకెట్లు, డబ్బాలు తెచ్చుకున్నారు. నూనె పట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు.
అయితే భారీ మొత్తంలో నూనె సమీప కాలువలో కలిసిపోయిందని సమాచారం. కొందరు కాలువల్లో తేలుతున్న చమురునూ సేకరించారని వార్తలు వస్తున్నాయి. కాగా ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ట్యాంకర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 40 టన్నుల పామాయిల్ రోడ్డు పక్కన కాలువలు, డ్రైనేజీల్లో ఒలికిపోయింది. దీంతో కొందరు స్థానికులు నూనెను సేకరించి, బకెట్లతో తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇవీ చదవండి
అధికారులు పట్టించుకోలేదని.. చివరికి మొసలిని పట్టుకొచ్చి..
బట్టతలపై జుట్టు మొలిపించే కరెంటు దువ్వెన!