Share News

బట్టతలపై జుట్టు మొలిపించే కరెంటు దువ్వెన!

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:19 AM

మనిషి జీవితాన్ని మార్చేసే ఆవిష్కరణలు.. ఆరోగ్యాన్ని కాపాడే అత్యాధునిక చికిత్సలు ఎన్నో వచ్చాయిగానీ.. బట్టతలపై జుట్టు మొలిపించే టెక్నాలజీ మాత్రం ఇప్పటికీ రాలేదు!

బట్టతలపై జుట్టు మొలిపించే కరెంటు దువ్వెన!
duvvena

  • అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులుప్రయోగశాలలో ఎలుకలపై రిసెర్చ్‌..

  • 28రోజుల్లో దట్టంగా పెరిగిన జుట్టు

  • మనుషులకు కూడా అదే స్థాయిలో పెరుగుతుందంటున్న పరిశోధకులు

బీజింగ్‌: మనిషి జీవితాన్ని మార్చేసే ఆవిష్కరణలు.. ఆరోగ్యాన్ని కాపాడే అత్యాధునిక చికిత్సలు ఎన్నో వచ్చాయిగానీ.. బట్టతలపై జుట్టు మొలిపించే టెక్నాలజీ మాత్రం ఇప్పటికీ రాలేదు! ..అని బాధపడే బాల్డ్‌ హెడ్‌ బాధితులకు చైనాలోని బీహాంగ్‌ వర్సిటీ పరిశోధకులు ఓ శుభవార్త వినిపించారు. నున్నటి తలపై నిగనిగలాడే దట్టమైన జుట్టు మొలిపించే ‘ఎలక్ట్రిక్‌ దువ్వెన’నొకదాన్ని రూపొందించామని వారు ప్రకటించారు. ప్రయోగాల్లో భాగంగా.. జుట్టు లేని కొన్ని ఎలుకలను ఎంచుకుని.. వాటికి ఎక్కడ జుట్టు లేదో ఆ ప్రాంతంలో ఈ దువ్వెనతో దువ్వడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా.. 28 రోజుల్లోనే ఆ ఎలుకల శరీరాలపై బాల్డ్‌ ప్యాచ్‌లు మాయమై ఆ ప్రాంతాల్లో జుట్టు గడ్డిదుబ్బులా పెరిగిందని వారు పేర్కొన్నారు.


2duvvena2.jpgఇంతకీ అంత జుట్టు వాటికి అంతలోనే ఎలా వచ్చింది? అసలీ దువ్వెన ఎలా పనిచేస్తుంది? అంటే.. ఆ కీలకం అంతా ఈ దువ్వెన రూపకల్పనలోనే ఉంది. ఈ కరెంటు దువ్వెన పళ్లలో వేర్వేరు ఎత్తుల్లో ఎలక్ట్రోడులు ఉంటాయి. దీంతో దువ్వుకున్నప్పుడు.. ఎత్తైన పళ్లు విద్యుత్‌ పల్స్‌ను పంపడం ద్వారా జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తాయి. ఇక పొట్టిగా ఉన్న పళ్లలో మందును నింపే భాగం ఉంటుంది. ఆ భాగంలో రెండు రకాల మందులను నింపుతారు. ఒకటి.. వీఈజీఎ్‌ఫఏ ప్లాస్మిడ్‌. ఇందులో ప్లాస్మిడ్‌ అంటే అదో చిన్న డీఎన్‌ఏ ముక్క. ఈ దువ్వెనతో తల దువ్వుకున్నప్పుడు సదరు ప్లాస్మిడ్‌.. జుట్టు కుదుళ్ల కణాల్లోకి వెళ్లి అక్కడ వీఈజీఎ్‌ఫఏ అనే ప్రొటీన్‌ను తయారుచేస్తుంది. ఈ ప్రొటీన్‌.. ఆ ప్రాంతంలో కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ఫలితంగా జుట్టు కుదుళ్ల చుట్టూ రక్తసరఫరా పెరుగుతుంది. దానివల్ల జుట్టు పెరుగుతుంది.


duvvena.jpgఇక రెండో మందు.. ‘ఎస్‌ఆర్‌డీ5ఏ2ఎ్‌సఐఆర్‌ఎన్‌ఏ’. ఇందులో ఎస్‌ఆర్‌డీ5ఏ2 అనేది.. సాధారణంగా అందరి తలలో జుట్టు కుదుళ్లలో ఉండే జన్యువు. అది 5-అల్ఫారిడక్టేజ్‌ అనే ఎంజైమ్‌ను తయారుచేస్తుంది. ఆ ఎంజైమ్‌.. టెస్టోస్టిరాన్‌ను ‘డైహైడ్రో టెస్టోస్టిరాన్‌ (డీహెచ్‌టీ)’గా మారుస్తుంది. డీహెచ్‌టీ ఎక్కువైతే కుదుళ్లు కుచించుకుపోయి జుట్టు రాలిపోతుంది. చైనా పరిశోధకులు తయారుచేసిన దువ్వెనలో ఉండే రెండో మందులోని ఎస్‌ఐఆర్‌ఎన్‌ఏ.. ఆ ఎస్‌ఆర్‌డీ5ఏ2 జన్యువుపై పని చేసి, 5-అల్ఫారిడక్టేజ్‌ ఎంజైమ్‌ తయారీని తగ్గించేస్తుంది. దీనివల్ల జుట్టు మొదళ్లు కుచించుకుపోకుండా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. అంటే.. ఈ దువ్వెనలోని ఎత్తైన పళ్లు జుట్టు పెరగడానికి దోహదం చేస్తే, పొట్టిగా ఉండే పళ్లు జుట్టు రాలకుండా ఆపుతాయన్నమాట. కాకపోతే.. ఇప్పటిదాకా దీంతో ఎలుకలపైన మాత్రమే ప్రయోగాలు చేశారు. మానవులపై కూడా ఈ దువ్వెన అద్భుత ఫలితాలు సాధిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. అన్నట్టు, చెప్పనే లేదు కదూ.. ఈ దువ్వెనకు వారొక పేరు కూడా పెట్టారు... ‘డీటాంగిల్‌’ అని! అంటే చిక్కు తీయడం అని అర్థం. ఈ దువ్వెన వాడితే చిక్కు తీసుకోవాల్సిన స్థాయిలో జుట్టు పెరిగిపోతుందనేమో వారి ఉద్దేశం!!

ఇవి కూడా చదవండి..

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Updated Date - Nov 18 , 2026 | 06:24 AM