Share News

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:14 AM

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లా గూలర్ బజార్ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి 8 మంది మృతిచెందగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..
Uttarakhand Bus Accident

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లా గూలర్ బజార్ సమీపంలో ఇవాళ (మంగళవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి 8 మంది మృతిచెందగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు వంతెన పైనుంచి సుమారు 100 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.


సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, లోయలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలనూ అక్కడికి రప్పించారు పోలీసులు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తెహ్రీ జిల్లా కలెక్టర్ నితికా ఖండేల్వాల్, ఎస్పీ శ్వేతా చౌబే ఘటనా స్థలానికి బయలుదేరారు. మరోవైపు, బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సోమవారం రాత్రి మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాన్సువాడ-మోహన్‌ఖల్ రహదారిపై ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వరుసగా వాహనాలు లోయల్లో పడి ప్రాణాలు కోల్పోతుండటంతో రోడ్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Updated Date - Nov 17 , 2026 | 10:37 AM