Share News

రెండేళ్ల తర్వాత క్వాడ్ సమావేశం.. మనీలాలో మోదీ, ట్రంప్ భేటీ..

ABN , Publish Date - Nov 17 , 2026 | 07:49 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మంగళవారం జరగనున్న క్వాడ్ అగ్రనేతల సమావేశంలో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు.

రెండేళ్ల తర్వాత క్వాడ్ సమావేశం.. మనీలాలో మోదీ, ట్రంప్ భేటీ..
Quad Summit 2026

న్యూఢిల్లీ, నవంబర్ 17: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) భేటీ కానున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న క్వాడ్ అగ్రనేతల సమావేశంలో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు. రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, వాణిజ్యం, కీలక ఖనిజాల సరఫరా, వ్యూహాత్మక సహకారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి క్వాడ్ అగ్రనేతల సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.


రెండేళ్ల తర్వాత ఒకే వేదికపై క్వాడ్ నేతలు..

భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి అగ్రనేతలు రెండేళ్ల విరామం తర్వాత సమావేశం కానున్నారు. చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అమెరికాలోని డెలావేర్‌లో క్వాడ్ నేతల సమావేశం జరిగింది. తాజాగా మనీలాలో జరిగే భేటీలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనే తకైచి పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత ప్రధాన చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి. ముఖ్యంగా సముద్ర మార్గాల భద్రత, నౌకాయాన స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వంపై నేతలు చర్చించే అవకాశం ఉంది. అలాగే కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (AI), సెమీకండక్టర్లు, సరఫరా గొలుసుల భద్రత వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపైనా దృష్టి సారించనున్నారు.


మోదీ-ట్రంప్ భేటీపై ఆసక్తి

మనీలాలో మోదీ, ట్రంప్ ఒకే వేదికపై పాల్గొననుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు, దిగుమతి సుంకాలు, రక్షణ రంగ సహకారం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, మోదీ, ట్రంప్ దాదాపు ఐదు నెలల తర్వాత కలుసుకోనున్నారు. వారి చివరి ద్వైపాక్షిక సమావేశం 2026 జూన్ 17న ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రజాస్వామ్యంపై భారత్‌కు ఐరోపా వాళ్లు పాఠాలు చెప్పనక్కర్లేదు

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..

Updated Date - Nov 17 , 2026 | 07:52 AM