అమితాబ్, అభిషేక్ బచ్చన్‌ల హత్యకు 200 మంది సిద్ధం.. గోల్డీ ధిల్లాన్ మరోసారి బెదిరింపులు..
ABN , Publish Date - Nov 17 , 2026 | 08:39 AM
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు మరోసారి హత్య బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ గురుప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డాడు.
ముంబై, నవంబర్ 17: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు మరోసారి హత్య బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ గురుప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డాడు. అమితాబ్ బచ్చన్ హత్యాయత్నాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి ఇద్దరి అరెస్ట్ చేసినప్పటికీ, తమ ప్రణాళికలు మాత్రం ఆగలేదని ఓ పోస్టులో పేర్కొన్నాడు.
ముంబైలో అమితాబ్, అభిషేక్‌లను హత్య చేసేందుకు 200 మంది తమ అనుచరులు సిద్ధంగా ఉన్నారని గోల్డీ ధిల్లాన్ హెచ్చరించాడు. బచ్చన్ కుటుంబానికి కల్పించిన బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ కూడా తమను ఆపలేదంటూ తేల్చి చెప్పాడు. వీరితో పాటు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సూత్రధారులను మట్టుబెడతానని బెదిరించాడు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎప్పటికీ క్షమించబోమని, సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించాడు.
కాగా, గ్యాంగ్‌స్టర్ ధిల్లాన్‌పై పంజాబ్, పరిసర ప్రాంతాల్లో హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో 2024 మార్చిలో చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త కుల్దీప్ సింగ్‌ను దోపిడీ చేసిన కేసు కూడా ఉంది. నిందితుడు విదేశాల్లో ఉంటూ ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అతడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. ధిల్లాన్ ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమతినీ ప్రకటించింది.
అయితే, 2026 జులైలో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు మేరకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని భారతదేశానికి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, పోలీసుల అదుపులో ఉండగా ఇంటర్నెట్, సోషల్ మీడియాను ధిల్లాన్ ఎలా యాక్సెస్ చేశాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
రెండేళ్ల తర్వాత క్వాడ్ సమావేశం.. మనీలాలో మోదీ, ట్రంప్ భేటీ..
పంజాబ్‌లో మరో పోలీసు హత్య.. తెహ్రీక్-ఎ-తాలిబన్ సంస్థపై అనుమానాలు