Share News

పంజాబ్‌లో మరో పోలీసు హత్య.. తెహ్రీక్-ఎ-తాలిబన్‌ సంస్థపై అనుమానాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 07:16 AM

పంజాబ్‌లో పోలీసులపై వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురు పోలీసులు హత్యకు గురవ్వగా.. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

పంజాబ్‌లో మరో పోలీసు హత్య.. తెహ్రీక్-ఎ-తాలిబన్‌ సంస్థపై అనుమానాలు
Head Constable Vinod Kumar

చండీగఢ్, నవంబర్ 17: పంజాబ్‌లో పోలీసులపై వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురు పోలీసులు హత్యకు గురవ్వగా.. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన ఇంటికి వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై లిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని గంటలకే తీవ్ర బుల్లెట్ గాయాలతో మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, 'తెహ్రీక్-ఎ-తాలిబాన్ హిందుస్థాన్' ఉగ్రవాద సంస్థే ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


సుజాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన టెక్నికల్ సర్వీసెస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ (42) వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. శిక్షణ కోసం ఆయన ఇటీవల సంగ్రూర్ వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి సుజాన్‌పూర్‌కు చేరుకున్నారు. అయితే, తన సోదరుడికి ఫోన్ చేసి బైపాస్ ప్రాంతానికి వచ్చి తీసుకెళ్లాలని కోరారు. దీంతో ఆయన సోదరుడు అక్కడికి వెళ్లగా.. వినోద్ కుమార్ ఎక్కడా కనిపించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. చివరకు కొన్ని గంటల తర్వాత బైపాస్ సమీపంలో విగతజీవిగా కనిపించారు. తలకు బుల్లెట్ గాయాలు కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇద్దరు వ్యక్తులు వినోద్ కుమార్‌ను ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. దీంతో వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


మరోవైపు, ఈ హత్యకు తామే బాధ్యులమని పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మద్దతు ఉన్న తెహ్రీక్-ఎ-తాలిబన్ హిందుస్థాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థను పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాది షాజాద్ భట్టి నడుపుతున్నాడు. కాగా, సెప్టెంబర్ 16న భారత హోం మంత్రిత్వ శాఖ షాజాద్ భట్టి నెట్‌వర్క్ (SBN)ను నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అలాగే, ఉపా చట్టం కింద భట్టిని ఉగ్రవాదిగా పేర్కొంది. అయితే, ఈ పోస్టర్ నిజమైనదా? ఆ సంస్థకు ఈ హత్యతో సంబంధం ఉందా? అనే విషయాలను పంజాబ్ పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

భారీగా ఖర్చు పెట్టినా.. కాలుష్యం పోదేం?

ఎన్నికల్లో రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలదే

Updated Date - Nov 17 , 2026 | 07:21 AM