ఎన్నికల్లో రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలదే
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:49 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏయే స్థానాలకు ఏ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న దానిపై అధికారం పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే..
రిజర్వేషన్ల రొటేషన్ విధానంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏయే స్థానాలకు ఏ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న దానిపై అధికారం పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని పేర్కొంది. తమ నియోజకవర్గాన్ని రిజర్వుడ్‌గా నిర్ణయించాలని కోరే హక్కు ఎవరికీ ఉండదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి నూతన రొటేషన్ విధానాన్ని అమలు చేస్తుండడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. రూపాలీ ఇంద్రభూషణ్ సోండే అనే వ్యక్తి.. బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ 2025 సెప్టెంబరులో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఉన్న రిజర్వేషన్ క్రమాన్ని పక్కన పెట్టి కొత్త రొటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల తదుపరి రిజర్వేషన్ పొందాల్సిన నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.