ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
ABN , Publish Date - Nov 17 , 2026 | 08:55 AM
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విదేశీ యూట్యూబర్‌కు ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. లైవ్‌స్ట్రీమ్ చేస్తుండగా ఓ యువకుడు ముద్దు పెట్టాలంటూ వెంటపడి వేధించాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఉదయ్‌పూర్‌లో విదేశీ మహిళా యూట్యూబర్ పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. టౌన్‌హాల్ గార్డెన్‌లో థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ 'జస్ట్‌కెత్' లైవ్‌స్ట్రీమ్ చేస్తుండగా.. అఫ్తాబ్ అలియాస్ గబ్రూ (23) అనే స్థానిక యువకుడు ఆమె వెంటపడి వేధింపులకు పాల్పడ్డాడు. ముద్దు కావాలంటూ ఆమె వెంటపడుతూ వేధించాండు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సుమోటోగా కేసు నమోదు చేసి సోమవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు ఉదయ్‌పూర్ ఎస్పీ అమృత దుహాన్ వెల్లడించారు.
వైరల్ అయిన ఆ వీడియోలో.. నిందితుడు యూట్యూబర్ జస్ట్‌కెత్ వద్దకు వచ్చి పెదవులపై ఒక్క ముద్దు ఇవ్వాలని పదేపదే బలవంతం చేయడం కనిపిస్తుంది. ఆమె తిరస్కరించినప్పటికీ అతడు వేధించడం ఆపలేదు. ఆ తర్వాత ఫొటో దిగి వెళ్తూ కరచాలనం కోరగా.. ఆమె ఫిస్ట్ బంప్‌తో బదులిచ్చింది. 5 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్న ఈ వీడియో.. దేశంలో మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై నవంబర్ 16న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ హితేంద్ర సింగ్‌కు అందిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలించి, టౌన్‌హాల్ గార్డెన్ ప్రాంతంలోని సుమారు 150 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. రద్దీగా ఉన్న బహిరంగ ప్రదేశంలో సదరు యువకుడు అశ్లీల పాటలు పాడుతూ, పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే పక్కా సమచారంతో అతడు ఉండే ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, మహిళలను వేధించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
పంజాబ్‌లో మరో పోలీసు హత్య.. తెహ్రీక్-ఎ-తాలిబన్ సంస్థపై అనుమానాలు