Share News

సెలవు అనుమతి.. ఇదేం పద్ధతి!

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:39 AM

హైదరాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుల సెలవుల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రతీ ఉపాధ్యాయుడితోపాటు వారి విధులను పర్యవేక్షించే హెచ్‌ఎంలు, అధికారులు సైతం ఇప్పటి నుంచి అదనపు కలెక్టర్‌ అనుమతి పొందాల్సి ఉంది.

సెలవు అనుమతి.. ఇదేం పద్ధతి!
Teachers, Attendance

  • కలెక్టర్‌ ఉత్తర్వులపై టీచర్ల ఆందోళన

  • అడిషనల్‌ కలెక్టర్‌ ద్వారా మంజూరుపై నిరసన

  • 95 శాతం హాజరు దాటేదాకా లీవ్‌ లేదనడంపై నిలదీత

  • ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ: జిల్లాలో ఉపాధ్యాయుల సెలవుల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రతీ ఉపాధ్యాయుడితోపాటు వారి విధులను పర్యవేక్షించే హెచ్‌ఎంలు, అధికారులు సైతం ఇప్పటి నుంచి అదనపు కలెక్టర్‌ అనుమతి పొందాల్సి ఉంది. అలా కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలకు లోనుకావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 672 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 1,03,753 మంది విద్యార్థులు చదువుతుండగా.. వారికి సుమారు 6,200 మంది ఉపాధ్యాయులు బోధనలు అందిస్తున్నారు. అయితే జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరుశాతం తగ్గిపోతుండడంతోపాటు పలువురు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.


ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం కలెక్టర్‌.. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ ఆర్‌ఎ్‌స)పై దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీల సమయంలో టీచర్లు ఎవరైనా వరుసగా రెండుసార్లు గైర్హాజరైతే సస్పెన్షన్‌ వేటు పడుతోందని హెచ్చరించారు. ఇదే సమయంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 95 శాతం విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు చేరే వరకు సెలవులు ఉండవని, తప్పనిసరిగా కావాలంటే అడిషనల్‌ కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇటీవల ఉత్తర్వులు విడుదల చేశారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీరోజు టీచర్లు, విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరును నమోదు చేసి పంపించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. కాగా, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని స్కూళ్లను తనిఖీ చేసి ఉప విద్యాధికారుల ద్వారా ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలలోపు అడిషనల్‌ కలెక్టర్‌కు నివేదికలు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


సంఘాల అభ్యంతరం

ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖాధికారులకు సంబంధించిన సెలవుల అనుమతిని అడిషనల్‌ కలెక్టర్‌ ద్వారా మాత్రమే మంజూరు చేయించుకోవాలని ఈనెల 13న హైదరాబాద్‌ కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ టీచర్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం (హెచ్‌టీపీఎఫ్) పేరిట ముఖ్య నాయకులు ఆదివారం నగరంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగుపడేందుకు సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటి పరిష్కా రానికి ఉన్న మార్గాలపై చర్చించాలని, అలా కాకుండా ఉపాధ్యాయ సంఘాలు పోరాడి సాధించుకున్న హక్కులకు, సౌలభ్యాలకు వ్యతిరేకంగా వ్యవస్థలను కేంద్రీకరిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం సమంజసం కాదని అధికారులను కోరారు.


హైదరాబాద్‌ జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు ఉన్నా యని, రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, బీహార్‌, కర్ణాటక, తదితర రాష్ర్టాల విద్యార్థులు ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరతారని, పండుగలు, వివిధ కార్యక్రమాలకు తమ సొంతూర్లకు వెళ్తే రోజుల తరబడి రాని పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో 95శాతం హాజరు, సెలవు కోసం టీచర్లు అడిషనల్‌ కలెక్టర్‌ దగ్గర అనుమతి తీసుకోవాలనే నిబంధన తీవ్ర ప్రతిబంధకంగా మారుతోందన్నారు. 10 మంది వరకు ఉపాధ్యాయులు ఉన్న ఏ పాఠశాలలోనైనా కనీసం ఒక్కరైనా సెలవు పెడితే.. అది 95 శాతం కన్నా తక్కువగా హాజరు ఉండే అవ కాశం ఉందని, ఇది ఏమాత్రం సమంజసంగా లేదని చెప్పారు. ఉత్తర్వులను వెంటనే రద్దుచేసి సంఘాలతో చర్చించాలని వారు కలెక్టర్‌ను కోరారు.


టీచర్ల ఆందోళన

గతంలో ఉపాధ్యాయులందరూ తమకు కావాల్సిన సెలవు కోసం పనిచేసే పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడికి లీవ్‌ లెటర్‌ అందించి పొందేవారు. అయితే తాజాగా కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వులతో ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తు సెలవు కోసం పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత కలెక్టరేట్‌కు వెళ్లి.. అక్కడ అడిషనల్‌ కలెక్టర్‌ను కలిసి లీవ్‌ లెటర్‌ ఇవ్వడం ఏమిటని వాపోతున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడికి ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మంగళవారం మా అమ్మకు హాస్పిటల్‌లో కేన్సర్‌ కీమోథెరపీ చికిత్స ఉంది. అందుకోసం నాకు సెలవు కావాలి.. దానికోసం హెచ్‌ఎంను అడిగితే నాకు చెప్పొద్దు.. అడిషనల్‌ కలెక్టర్‌ను కలిసి తీసుకోండి అన్నారు..’’ అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి.. అని ఓ పాఠశాలకు చెందిన టీచర్‌ సోమవారం తమ సంఘాల నాయకులతో వాపోయినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా కాంగ్రెస్‌.. రెండో జాబితా విడుదల

గంజాయి అక్రమ రవాణా నిందితుడిపై పీడీ యాక్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 08:39 AM