గుంటూరు జిల్లా జైలు వద్ద వైసీపీ కార్యకర్తల వీరంగం
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:51 AM
గుంటూరు జిల్లా జైలు వద్ద వైసీపీ కార్యకర్తలు వీరంగం వేశారు. వారి అత్యుత్సాహం కారణంగా జరిగిన తోపులాటలో ఎస్‌ఐ గాయపడ్డారు. బ్యాలెట్ బాక్స్ తరలింపు వివాదానికి సంబంధించిన కేసులో అరెస్టయిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గత పది రోజులుగా గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
తోపులాటలో ఎస్‌ఐకు గాయాలు
నేతల ములాఖత్ పేరుతో అత్యుత్సాహం
గుంటూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా జైలు వద్ద వైసీపీ కార్యకర్తలు వీరంగం వేశారు. వారి అత్యుత్సాహం కారణంగా జరిగిన తోపులాటలో ఎస్‌ఐ గాయపడ్డారు. బ్యాలెట్ బాక్స్ తరలింపు వివాదానికి సంబంధించిన కేసులో అరెస్టయిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గత పది రోజులుగా గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోమవారం ఆయనను ములాఖత్‌లో కలిసేందుకు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తదితరులు జైలు వద్దకు చేరుకున్నారు. ములాఖత్ నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న నేతల వాహనాలను మాత్రమే పోలీసులు జైలు ఆవరణలోకి పంపించారు. నేతల వాహనాలు లోపలికి వెళుతున్న సమయంలో వాటి వెనుకే వైసీపీ కార్యకర్తలు కూడా గుంపులుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కార్యకర్తలు గేటును నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పట్టాభిపురం ఎస్సై రామాంజనేయులు వారిని అడ్డుకునేందుకు గేటును మూయడానికి యత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో గేటు మధ్యలో ఆయన కాలు ఇరుక్కోవడంతో అదుపుతప్పి కిందపడిపోయారు. ఆయన చేతి ఎముక విరగడంతో పాటు కాలికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు, సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.