ఏడుకొండల స్వామి నెలవు.. అక్కడ ఎన్నికలు ఉండవు
ABN , Publish Date - Nov 17 , 2026 | 07:05 AM
తిరుమల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. అనునిత్యం లక్షలాది మంది యాత్రికులతో కిక్కిరిసే ప్రాంతం.
తిరుమల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. అనునిత్యం లక్షలాది మంది యాత్రికులతో కిక్కిరిసే ప్రాంతం. అంతేకాదు దాదాపు 4 వేల మంది ఓటర్లు జీవించే కొండ ప్రదేశం కూడా. రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల హడావుడి నెలకొన్నా తిరుమలలో మాత్రం ఆ పరిస్థితి కనిపించదు. అక్కడ నివసించే స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు మినహా పంచాయతీ ఎన్నికలు ఎరుగరు. తిరుమల పేరుకు గ్రామ పంచాయతీ అయినప్పటికీ అక్కడ పంచాయతీ ఎన్నికలు జరగవు. దేవదాయ శాఖ చట్టం కింద అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రత్యేక ప్రదేశంగా పరిగణించారు. ఈ క్రమంలో 1964లో టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న బి.నర్సింగరావును పంచాయతీ అధికారిగా నియమించారు. అప్పటి నుంచే టీటీడీ ఈవోయే తిరుమల పంచాయతీ అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉంటున్న స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే భాగస్వాములవుతున్నారు.

శ్రీవారు వెలసిన తిరుమల కొండను 1910 నాటి వరకు ‘తిరువేంగడం’ అని పిలిచేవారట. తొలిరోజుల్లో పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పరిపాలకులు, ఆర్కాటు నవాబులు, మహంతులు గోవిందుడిని ఆరాధించి సేవలందించారు. ఎంతోమంది తిరుమల క్షేత్రాన్ని పాలించినప్పటికీ దట్టమైన అడవిలో ఉన్న క్షేత్రం కావడంతో సాయంత్రమైతే మూగబోవాల్సివచ్చేది. దీంతో తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా భక్తుల సంఖ్య పెంచాలని అప్పట్లో పాలకులు నిర్ణయించారు. కొన్ని నివాసగృహాలను ఏర్పాటు చేసి కొంతమంది అక్కడే జీవించేలా చర్యలు తీసుకున్నారు. 1910లో మహంతు ప్రయోగ్దాస్ ఈ కార్యక్రమానికి నడుంబిగించారు. క్షేత్రానికి చుట్టుపక్కల ఉండే తమిళనాడు, చిత్తూరు వంటి ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి భూములను లీజుకు ఇచ్చారు. దాంతో కొండపై నివాసం ఉండే స్థానికుల సంఖ్య పెరగడంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. స్థానికులనే ఉద్యోగులు, పనివాళ్లుగా నియమించుకోవడంతో తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ గ్రామం ఏర్పడింది. నాలుగుమాడవీధులు, పెరిందేవమ్మతోట, చంద్రబాబుతోట, ఆళ్వార్ట్యాంక్, పూటకూళ్లమిట్ట, మాధవనగర్, సూరాపురంతోట, సామేరుతోట, అల్లెమ్మతోట, సన్నిధివీధి, మెదరమిట్టి, మొండిగోపురం, సింగమాలవీధి, పుల్లారెడ్డి వీధి, గొల్లకృష్ణయ్య సందు, మూలమఠం, బొమ్మలగోపురం వంటి పేర్లతో కాలనీలు, ప్రాంతాలుగా మారాయి.
తిరుమలలో 1910లో వందగా ఉన్న స్థానికుల సంఖ్య కాస్తా.. దాదాపు 30 వేల వరకు పెరిగింది. 1975 వరకు నివాస గృహాల మధ్యలోనే స్వామి క్షేత్రం ఉండేది. అయితే క్రమేణా భక్తుల రాక పెరగడంతో రద్దీ ప్రాంతంగా మారిపోయింది. ఇళ్ల మధ్యలోనే క్యూలైన్లో నిలబడి స్వామిని దర్శించుకోవాల్సి వచ్చేది. ఈ సందర్భంలోనే కొన్ని నిర్మాణాలు చేయాలని టీటీడీ భావించింది. వీటితోపాటు మాడవీధుల విస్తరణ, ఉత్సవాలను తిలకించేందుకు విశాలమైన ప్రాంతాల ఏర్పాటు వంటి వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే భక్తుల సౌకర్యాల కల్పన కోసం స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించారు. ప్రత్యామ్నాయంగా కొండకింద ఇళ్లను ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి కొండపైనే జీవిస్తున్నప్పటికీ తమ సొంతూరును కొందరు స్థానికులు వదులుకోవాల్సి వచ్చింది. దఫాలవారీగా మాస్టర్ప్లాన్ను అమలుచేసి ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లను తొలగించారు. ఈ క్రమంలో ఓట్లర సంఖ్య ప్రస్తుతం భారీగా తగ్గిపోయింది. ఇటీవల నిర్వహించిన ‘సర్’ కార్యక్రమంలో 3,633 మంది ఓటర్లు ఉన్నట్టు తేల్చారు.
- (తిరుమల, ఆంధ్రజ్యోతి)