అధికారులు పట్టించుకోలేదని.. చివరికి మొసలిని పట్టుకొచ్చి..
ABN , Publish Date - Nov 17 , 2026 | 07:37 PM
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ చేసిన సాహసం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అటవీ అధికారులు వచ్చి మొసలిని పట్టుకుంటారని ఎదురుచూసి విసిగిపోయిన ఆమె.. చివరికి తానే రంగంలోకి దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ చేసిన సాహసం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అటవీ అధికారులు వచ్చి మొసలిని పట్టుకుంటారని ఎదురుచూసి విసిగిపోయిన ఆమె.. చివరికి తానే రంగంలోకి దిగింది. జబల్‌పూర్‌లోని ఖమారియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సున్‌పూర్ ఘనా గ్రామానికి చెందిన రైతు లక్పత్ యాదవ్, ఆయన భార్యకు తమ పొలంలోని చెరువులో సుమారు నాలుగు అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే.. ఎంతసేపటికీ అధికారులు అక్కడికి చేరుకోకపోవడంతో ఆ దంపతులే మొసలిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. చెరువులో వల వేసి మొసలిని పట్టుకున్న అనంతరం.. ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా దానిని చేతుల్లోకి ఎత్తుకుంది.
అనంతరం మొసలిని అటవీ శాఖ సిబ్బందికి అప్పగించేందుకు తీసుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందించినప్పటికీ అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో తామే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటన అటవీ శాఖ స్పందనపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు వన్యప్రాణులను పట్టుకోవడంలో ఉన్న ప్రమాదాలను కూడా గుర్తుచేస్తోంది. మొసళ్లు వంటి ప్రమాదకరమైన జంతువులను పట్టుకోవడం సాధారణ విషయం కాదు. సరైన శిక్షణ, రక్షణ పరికరాలు లేకుండా వాటిని సమీపించడం ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, నిపుణులైన సిబ్బందితో రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!