వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:04 AM
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో.. వైల్డ్‌లైఫ్ పార్కుల్లో వన్యప్రాణుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో.. వైల్డ్‌లైఫ్ పార్కుల్లో వన్యప్రాణుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తాజాగా గుజరాత్లో అంబార్డి సఫారీ పార్క్‌లోని సిబ్బంది ఓ సింహాన్ని బైక్‌లతో తరుముకుంటూ వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఓపెన్ గ్రౌండ్ వైపు ఆ సింహాన్ని మళ్లించేందుకు పార్క్ సిబ్బందిలోని ముగ్గురు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో ‘వన్యప్రాణుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ పార్క్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖను కోరుతున్నారు. అదే వీడియోలో ఓ ప్రభుత్వ వాహనం కూడా కనిపించింది.
అయితే పార్క్‌ను సందర్శించిన వీఐపీ అతిథులకు వన్యప్రాణులను దగ్గర నుంచి చూపించేందుకే సిబ్బంది బైక్‌లతో ఆ సింహాన్ని మైదానం వైపు తరిమినట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు రావడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. సిబ్బందిలోని ముగ్గురినీ విధుల నుంచి తొలగించారు. అలాగే ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా ప్రారంభించామని గుజరాత్ అటవీ దళాల అధిపతి (PCCF - Principal Chief Conservator of Forests) జైపాల్ సింగ్ వెల్లడించారు. ‘అంబార్డి సఫారీ పార్క్‌లో జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టాం. సాధారణంగా వన్యప్రాణులను వ్యాన్లపై ఎక్కించి ఒకచోట నుంచి మరోచోటకు తరలించాలి. కానీ ఇక్కడ సింహాన్ని సిబ్బంది బైక్‌లతో తరిమారు’ అని ఆయన మీడియాకు వెల్లడించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సిబ్బంది తీరును గట్టిగా విమర్శిస్తున్నారు. వీఐపీ అతిథుల కోసం వన్యప్రాణులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!