Share News

కనపడని డాక్టర్‌..ఏఐ

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:15 AM

వైద్యం అంటే ఠక్కున గుర్తొచ్చేవి.. డాక్టర్‌, స్టెతస్కోప్‌, మందుల చీటీ.. ఇవే! కానీ.. కృత్రిమ మేధ రాకతో అదంతా మారిపోయింది. ఆస్పత్రుల్లో, పరిశోధన శాలల్లో, చివరికి మన చేతి వాచీలలో కూడా నిశ్శబ్దంగా పని చేస్తూ.. ఏఐ అద్భుత సేవలు అందిస్తోంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది.

కనపడని డాక్టర్‌..ఏఐ
AI in Healthcare

  • స్కాన్‌ల విశ్లేషణ నుంచి శస్త్రచికిత్సల వరకూ డాక్టర్లకు తోడుగా కృత్రిమ మేధ

  • వైద్యుల నైపుణ్యాలకు ఏఐ సామర్థ్యం తోడుకావడంతో అద్భుత ఫలితాలు

  • హైదరాబాద్‌ ఆసుపత్రుల్లోనూ.. కృత్రిమ మేధ ఆధారిత వైద్య సేవలు

(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)

వైద్యం అంటే ఠక్కున గుర్తొచ్చేవి.. డాక్టర్‌, స్టెతస్కోప్‌, మందుల చీటీ.. ఇవే! కానీ.. కృత్రిమ మేధ రాకతో అదంతా మారిపోయింది. ఆస్పత్రుల్లో, పరిశోధన శాలల్లో, చివరికి మన చేతి వాచీలలో కూడా నిశ్శబ్దంగా పని చేస్తూ.. ఏఐ అద్భుత సేవలు అందిస్తోంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. ఇప్పటికే ఈ మార్పు చాలా చోట్ల కనిపిస్తోంది. ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్లను విశ్లేషించి క్యాన్సర్‌, క్షయ, పక్షవాతం వంటివాటి బారిన పడే ప్రమాదం ఉంటే.. ఏఐ ఆ విషయాన్ని చాలా త్వరగా గుర్తిస్తోంది. డాక్టర్ల పని భారాన్ని తగ్గించడంలో కూడా ఏఐ పాత్ర పెరుగుతోంది. అంతేనా.. ఔషధాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనల్లో కూడా ఏఐ వేగాన్ని తెచ్చింది. ఆసుపత్రుల్లో చేరిన రోగుల పరిస్థితిని ముందుగానే అంచనా వేసి డాక్టర్లను అప్రమత్తం చేసే వ్యవస్థలు కూడా వస్తున్నాయి. విదేశాల్లోనే కాదు.. మన హైదరాబాద్‌లో కూడా పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


అది హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ హాస్పిటల్‌. అనారోగ్య సమస్యతో అక్కడికి వచ్చిన అశోక్‌ (పేరుమార్పు).. డాక్టర్‌ ముందు కూర్చుని తన సమస్యలను ఏకరువు పెడుతున్నాడు. డాక్టర్‌ అన్నీ శ్రద్ధగా వింటున్నారు. కానీ, పేపర్‌ పై ఏమీ రాయడం లేదు. అలా చాలాసేపు అతడి సమస్యలన్నీ విన్న ఆయన.. తన ల్యాప్‌ టాప్‌ను ఒకటి- రెండు నిమిషాలు చూసి, అతడి చేతిలో మందులచీటీ పెట్టారు. ఆ చీటీ చూసి ఆశ్చర్యపోవడం అశోక్‌ వంతయింది. తాను చెప్పిన విషయాలతోపాటు, మెడికల్‌ రిపోర్టుల్లోని వివరాలూ అందులో కచ్చితంగా ఉన్నాయి. అసలు డాక్టర్‌ ఏమీ రాయకుండానే ఇన్ని వివరాలు ఎలా నమోదు చేయగలిగారన్నది అతడి ఆశ్చర్యానికి కారణం.

భీమవరానికి చెందిన రామరాజు (పేరుమార్పు) కొన్ని నెలలుగా తలనొప్పితో బాధ పడుతున్నాడు. సీటీ స్కాన్‌ సహా అన్ని పరీక్షలూ చేసినా.. నివేదికలన్నీ సాధారణం అన్నట్లుగానే వచ్చాయి. మందులు వాడుతున్నా తాత్కాలిక ఉపశమనమే తప్ప తలనొప్పి మాత్రం తగ్గలేదు. చివరకు తన వద్ద ఉన్న రిపోర్టులతోనే హైదరాబాద్‌ వచ్చాడతను. వాటిని పరిశీలించిన వైద్యులు మరోసారి స్కాన్‌ చేయాలని సూచించారు. భీమవరంలో తీసిన స్కాన్‌కు, ఇక్కడ తీసిన స్కాన్‌కు పెద్దగా తేడా లేదు. కానీ , సాధారణ పరిశీలనలో గుర్తించలేని ఒక అనుమానాస్పద అంశం ఇక్కడ ఎలా తెలిసిందని రామరాజు ఆశ్చర్యపోయాడు.


ఈ రెండు సందర్భాల వెనుక ఉన్నది ఒకటే.. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - ఏఐ). రోగి మాటలను విని రికార్డుగా మార్చే వ్యవస్థలు, స్కాన్‌లో కంటికి కనిపించని మార్పును పట్టేసే ఇమేజింగ్‌ టూల్స్‌, ఐసీయూలో రోగి గుండె వేగం, శ్వాసను నిరంతరం గమనిస్తూ ప్రమాదాన్ని ముందే హెచ్చరించే వ్యవస్థలు.. ఇవన్నీ ఇప్పుడు రాజధాని హైదరాబాద్‌ నగరంలోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రోజువారీ పనిలో భాగమయ్యాయి. వేగం, కచ్చితత్వం, వ్యాధిని ముందే పసిగట్టడం.. ఈ మూడూ ఏఐ ఇస్తున్న హామీలు. తొలిదశలోనే జబ్బు బయటపడితే చికిత్స సులువు, ఖర్చూ తక్కువ. అందుకే హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు ఏదో ఒక రూపంలో ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. అవి నిపుణులైన వైద్యులకు ప్రత్యామ్నాయాలు కాదుగానీ.. నిర్ణయాలు తీసుకోవడంలో వైద్యులకు ఎంతగానో ఉపయోగపడే సహాయకుల పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాయి.


ఉదాహరణకు.. మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు ప్రతి నిమిషం విలువైనదే. రక్తనాళంలో అడ్డంకి ఎక్కడ ఉంది అనేది తేలితేనే చికిత్స మొదలవుతుంది. ఈ క్రమంలోనే.. అపోలో ఆసుపత్రి మెడ్‌ట్రానిక్‌ భాగస్వామ్యంతో ఉపయోగిస్తున్న సాంకేతికత మెదడు స్కాన్లను రెండు నిమిషాల్లోపే విశ్లేషించి వైద్యులకు కీలక సమాచారాన్ని అందిస్తోంది. చికిత్సకు సంబంధించిన నిర్ణయాల్ని వేగంగా తీసుకునేందుకు ఉపయోగపడుతోంది. ఇలా తాము ఇప్పటికే పది ప్రధాన వైద్య విభాగాల్లో ఏఐ సాధనాలను వాడు తున్నామని అపోలో ఆస్పత్రుల మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుబ్బారెడ్డి తెలిపారు. స్ట్రోక్‌ నిర్ధారణతోపాటు.. క్షయ, మెదడులో రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్‌ సంకేతాలను ఎక్స్‌రే, సీటీ, మామోగ్రఫీ చిత్రాల్లో ముందే గుర్తించడానికి ఈ సాధనాలు తోడ్పడుతున్నాయని ఆయన వివరించారు.


Untitled-1 copy.jpgఐసీయూలో డిజిటల్‌ కాపలా

ఐసీయూలో ఒకేసారి ఎక్కువ మంది రోగులుంటారు. ప్రతి ఒక్కరి గుండె వేగం, శ్వాస, రక్తపోటు, ఆక్సిజన్‌ స్థాయుల్లో చిన్నచిన్న మార్పులను సిబ్బంది ప్రతి క్షణం గమనించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే.. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి 2025 నవంబరులో ఏఐ ఆధారిత ‘ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌’ తెచ్చింది. దాంట్లో భాగంగా రోగులకు వైర్‌లెస్‌ సెన్సర్లు అమర్చి, కీలక సూచీలను 24 గంటలూ గమనిస్తోంది. ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే వెంటనే వైద్య బృందాన్ని అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల.. పరిస్థితి విషమించకముందే చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యవస్థ చేసే ప్రతి హెచ్చరికా ప్రాణాపాయాన్ని సూచించదని, దాన్ని పరిశీలించి చర్య తీసుకోవాల్సింది వైద్య బృందమేనని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.


రాత పనికి సెలవు

వైద్యుడి వద్దకు వెళ్లి వచ్చాక.. ‘డాక్టరు మేం చెప్పింది పూర్తిగా వినలేదు’ అని చాలామంది రోగులు ఫిర్యాదుచేస్తుంటారు. అయితే.. రోగితో గడిపే సమయంలో 40-50 శాతం వివరాల నమోదు, పాత రికార్డుల పరిశీలనకే పోతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ భారాన్ని ఏఐ ’యాంబియంట్‌ స్ర్కైబ్‌’ వ్యవస్థలు తగ్గిస్తున్నాయి. అవి డాక్టర్‌-రోగి మధ్య జరిగే సంభాషణను విని, రోగ లక్షణాలు, గత చరిత్ర, వాడుతున్న మందుల వివరాలతో డిజిటల్‌ రికార్డును అక్కడికక్కడే సిద్ధం చేస్తాయి. ప్రిస్ర్కిప్షన్‌ ముసాయిదానూ రాసిస్తాయి. అయితే.. ‘‘ఏఐ రాసిన రికార్డులో తప్పులు ఉండవచ్చు. కాబట్టి డాక్టర్‌ వాటిని చదివి, సరిదిద్ది ఆమోదించాల్సిందే’’ అని స్టార్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ లీడ్‌ (ఎమర్జెన్సీ మెడిసిన్‌) డాక్టర్‌ రాహుల్‌ కట్టా చెప్పారు. ఓపీకి వచ్చే రోగి పాత నివేదికలన్నీ క్షణాల్లో సంక్షిప్తంగా ముందుంచడం, ఆరు గంటల శస్త్రచికిత్స వీడియోను కొన్ని సెకన్లలో విశ్లేషించడం కూడా ఏఐతో సాధ్యమేనని యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ క్లినికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చినబాబు సుంకవల్లి వివరించారు.


ఈసీజీలో సూక్ష్మ మార్పులనూ..

సాధారణ ఈసీజీలోని సూక్ష్మ మార్పులనూ ఏఐ గుర్తిస్తోందని మెడికవర్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ అనిల్‌ కృష్ణ చెప్పారు. ఈసీజీ మామూలుగా ఉన్నా గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గినవారిని (లో ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌) ఏఐ గుర్తించినట్లు అధ్యయనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ‘అయితే అలాంటి సందర్భాల్లో ఏఐ అప్రమత్తం మాత్రమే చేస్తుంది. అదనపు పరీక్షలు చేసి నిర్ధారించేది డాక్టరే’ అని ఆయన స్పష్టం చేశారు.

సూక్ష్మమైన గడ్డలనూ పట్టేస్తోంది

ఒక రేడియాలజిస్టు రోజుకు వందలాది ఎక్స్‌రేలు చూడాల్సి రావచ్చు. ఆ అలసటలో.. ఎక్స్‌రేలో ఉండే చిన్న మార్పులు రేడియాలజిస్టుల కంటపడకపోవచ్చు. అలాంటివి జరగకుండా ఉండేందుకు.. హైటెక్‌ సిటీలోని యశోద ఆసుపత్రి 2025 నవంబరులో క్యూర్‌.ఏఐ, ఆస్ర్టాజెనెకా సంస్థలతో కలిసి ఏఐ ఆధారిత ’లంగ్‌ నాడ్యూల్‌ క్లినిక్‌’ ప్రారంభించింది. ఇది సాధారణ ఛాతీ ఎక్స్‌రేలను వడపోసి.. ఊపిరితిత్తుల్లో ఏవైనా చిన్న గడ్డలు (నాడ్యూల్స్‌.. ఇవి క్యాన్సర్‌కు తొలి సంకేతం కావొచ్చు) ఉంటే వాటిని గుర్తించి.. అనుమానాస్పదంగా కనిపించేవాటిని వేరు చేస్తుంది. వాటి ఆధారంగా ఆ రోగిని వెంటనే సంప్రదించి తదుపరి పరీక్షలకు పంపుతారు.


యశోద ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటిదాకా ఆ క్లినిక్‌లో కృత్రిమ మేధ 17 వేలకు పైగా ఛాతీ ఎక్స్‌రేలను విశ్లేషించి.. 960కి పైగా గడ్డలను గుర్తించింది. వాటిలో 136 అత్యంత ప్రమాదకరమైనవి కాగా.. అవి ఎవరివో గుర్తించి, 77 మందిని వెంటనే సీటీ స్కాన్‌, పల్మనాలజీ పరీక్షకు పంపారు. వారిలో కొందరు ఊపిరితిత్తుల క్యాన్సర్‌, క్షయ, సార్కోయిడోసిస్‌, లింఫోమా బారిన పడ్డట్టు వెల్లడైంది. దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు 80 శాతం చివరి దశలోనే బయటపడుతున్నాయి. కానీ, ఏఐ కారణంగా అలాంటి ముప్పులను ముందే గుర్తించే వీలుంది. అదే కాదు.. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి చేసే మామోగ్రఫీ పరీక్షల్లోనూ కృత్రిమ మేధను వినియోగిస్తున్నట్టు డాక్టర్‌ చినబాబు సుంకవల్లి తెలిపారు.


శస్త్రచికిత్సలోనూ..

అనారోగ్య సమస్యలను తొలిదశల్లో గుర్తించడంలోనే కాదు.. శస్త్రచికిత్సల ప్రణాళికలోనూ కృత్రిమ మేధ ఎంతగానో ఉపయోగపడుతోంది. సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ల ఆధారంగా.. శరీరంలో కణితి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం, శస్త్రచికిత్సలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయడం వంటి పనుల్లో కృత్రిమ మేధ టూల్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయి. రోబోటిక్‌ సర్జరీలో ఏఐ అనుసంధానంతో.. ఆపరేషన్‌ ఎంత కచ్చితంగా జరిగిందో ఆబ్జెక్టివ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ (ఓపీఐ) ద్వారా అంచనా వేయవచ్చని డాక్టర్‌ చినబాబు సుంకవల్లి వెల్లడించారు.


క్యాన్సర్‌ చికిత్సలోనూ..

మానవాళి పాలిట మహమ్మారిగా మారిన క్యాన్సర్‌ చికిత్సలోనూ ఏఐ కీలకపాత్ర పోషిస్తోంది. జన్యు, రేడియాలజీ, పాథాలజీ నివేదికలను కలిపి చూసి ఏ రోగికి ఏ మందు పనిచేస్తుందో అంచనా వేయడాన్ని ‘ప్రెసిషన్‌ ఆంకాలజీ’ అంటారు. రేడియేషన్‌ చికిత్స ప్రణాళికకు గతంలో రెండుమూడు రోజులు పట్టేది. ఇప్పుడు ఏఐ సాయంతో అది కొన్ని గంటల్లోనే పూర్తివుతోందని డాక్టర్‌ చినబాబు తెలిపారు.


ఒకే జబ్బు.. వేర్వేరు చికిత్సలు..

ఒకే రకమైన రక్తనాళాల సమస్య ఉన్న ఇద్దరిలో ఒకరికి మందులు సరిపోవచ్చు, మరొకరికి స్టెంట్‌ అవసరం కావచ్చు. వయసు, వైద్య చరిత్ర, ఇతర జబ్బులు, మందులకు స్పందించే తీరును కలిపి విశ్లేషించి ఎవరికి ఏది సరిపోతుందో నిర్ణయం తీసుకోవాల్సింది వైద్యుడే. ఈ పనులన్నీ చేయడంలో డాక్టర్‌లకు ఏఐ ఎంతగానో తోడ్పడుతోందని డాక్టర్‌ అనిల్‌ కృష్ణ చెప్పారు. అయితే.. ఏఐ ఇచ్చేది సూచన మాత్రమేనని, తుది నిర్ణయం తీసుకునేది డాక్టరేనని ఆయన స్పష్టం చేశారు.


జబ్బు రాకముందే అంచనా

వ్యాధి వచ్చాక గుర్తించడం ఒక ఎత్తు అయితే, రాబోయే ముప్పును ముందే అంచనా వేయడం మరో ఎత్తు. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ), దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌), లివర్‌ ఫైబ్రోసిస్‌ (కాలేయం గట్టిపడడం) వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును అంచనా వేసే 12 ఏఐ అల్గారిథమ్‌లను అపోలో అభివృద్ధి చేసింది. 17 లక్షలకు పైగా రోగుల రికార్డులతో వీటిని ధ్రువీకరించామని ఆ సంస్థ చెబుతోంది. హెల్త్‌ చెకప్‌లోనే వీటిని వాడుతున్నారు. వ్యాధి ముదరకముందే తగిన జాగ్రత్తలు, చికిత్స అందించేలా డాక్టర్లకు ముందస్తు సంకేతాలు ఇవ్వడమే వీటి ఉద్దేశమని అపోలో మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి తెలిపారు.


ఖర్చు తగ్గేనా?

ఏఐ సాయంతో వ్యాధులను తొలిదశలో గుర్తించడం, అనవసర పరీక్షల తగ్గుదల వంటివాటివల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ల సామర్థ్యం కూడా దాదాపు రెట్టింపు అవుతోంది. ఉదాహరణకు రోజుకు 100 ఎక్స్‌రేలు చూసే డాక్టర్‌. ఏఐ సాయంతో 200 ఎక్స్‌రేల దాకా చూడగలరని అంచనా. కానీ ఈ వ్యవస్థలపై పెట్టుబడి భారీగా ఉంటోంది. వాటికోసం వందలాది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, వెంటనే తక్కువ ధరకు సేవలు అందించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని నిపుణులు అంగీకరిస్తున్నారు. మెరుగైన చికిత్సకు మాత్రం హామీ ఉంటుందని వారి మాట. అంటే కార్పొరేట్‌ ఆసుపత్రిలో రోగి బిల్లు ఇప్పట్లో తగ్గదు.


ప్రభుత్వ ప్రణాళికలోనూ..

‘తెలంగాణ రైజింగ్‌- 2047’ ఆరోగ్య ప్రణాళికలో.. సెప్సిస్‌, ఊపిరితిత్తుల వ్యాధులు, ఫాటీ లివర్‌ (ఎన్‌ఏఎ్‌ఫఎల్‌డీ), హైరిస్క్‌ గర్భాలను ముందే గుర్తించే ఏఐ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రతిపాదించారు. అలాగే.. ఏఐ ఆధారిత ఊపిరితిత్తుల క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ర్టాజెనెకా ఇండియాతో ఒప్పందం చేసుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 20 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో క్యూర్‌.ఏఐ ఛాతీ ఎక్స్‌రే సాంకేతికతను అమలు చేయనున్నారు.


ఇక.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఆల్వాల్‌, కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్‌ఎంలు, నర్సులు ఇప్పటికే ఏఐ ఆధారిత చిన్న పరికరాలతో మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఓ సేవా సంస్థ ఈ పరికరాలను ఆరోగ్యశాఖకు అప్పగించింది. అక్కడ వారికి అనుమానం వస్తే.. సంబంధిత రోగులను మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రికి లేదా ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీకి పంపుతారు. ఎందుకంటే ఈ పరికరాలు రోగుల్లో అనుమానాస్పదంగా ఉన్న కణజాలాన్ని గుర్తించగలవు తప్ప.. క్యాన్సర్‌ ఉన్నదీ లేనిదీ నిర్ధారించవు. 2023 నుంచి ఖమ్మంలో ఓ సేవా ప్రాజెక్టు ద్వారా చాలా మందికి ఇలాంటి పరీక్షలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలిపి వేలాది మంది మహిళలకు స్ర్కీనింగ్‌ జరిగిందని ఈ పరికరాలను తయారుచేసిన సంస్థ చెబుతోంది.


ఫోన్‌లో డాక్టర్‌ వెనుక.. ఏఐ

కేంద్ర ప్రభుత్వ ఉచిత టెలిమెడిసిన్‌ సేవ ’ఈ-సంజీవని’. ఈ ఏడాది సెప్టెంబరు 15 నాటికి దీనిద్వారా 50 కోట్ల సంప్రదింపులు జరిగాయి. దాంట్లో ఏఐ ఆధారిత క్లినికల్‌ డెసిషన్‌ సపోర్ట్‌ వ్యవస్థను అనుసంధానించారు. అలాగే.. అపోలో స్ర్టోక్‌ వ్యవస్థలోనూ నిపుణులు ఎక్కడున్నా మెదడు స్కాన్‌ను మొబైల్‌లో చూడవచ్చు.


రోబో డాక్టర్లు వస్తారా?

ఆరోగ్య రంగంలో ఏఐ అతి ముఖ్యమైన ఉపకరణం కావొచ్చుగానీ.. ఒక రోబో ఎన్నటికీ డాక్టర్‌ కాలేదని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రాజారావు తేల్చి చెప్పారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) తెలంగాణ చాప్టర్‌ పదో వార్షిక సదస్సులో ‘ది ఫ్యూచర్‌ ఫిజిషియన్‌’ అంశంపై మాట్లాడిన ఆయన.. మనిషి విచక్షణను, యంత్ర మేధను కలిపి వాడుకుంటూ, మానవ తప్పిదాలు, యంత్రాల పొరపాట్లు రెండింటి నుంచీ రోగిని కాపాడే వైద్యుడే భవిష్యత్తులో కీలకమని స్పష్టం చేశారు.


అద్భుతాల వెనుక ఆందోళనలూ!

ఏఐ అద్భుతంగా పనిచేసే మాట నిజమే అయినా.. అది కూడా కొన్ని తప్పులు చేస్తుంది. కొన్నిసార్లు లేని జబ్బును ఉన్నట్టుగా (ఫాల్స్‌ పాజిటివ్‌).. ఉన్న జబ్బును లేనట్టుగా (ఫాల్స్‌ నెగెటివ్‌) చెప్పే ప్రమాదం కూడా లేకపోలేదు. ఉదాహరణకు గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ లాంగ్వేజ్‌ టెక్నాలజీస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఎల్‌టీఆర్‌సీ) పరిశోధకులు నాలుగు ఏఐ మోడళ్ల ద్వారా వేలాది ఛాతీ ఎక్స్‌రేలను విశ్లేషించారు. ఆ మోడల్స్‌ ఇచ్చిన నివేదికలు.. కొన్ని సందర్భాల్లో రేడియాలజిస్టుల పరిశీలనకు భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. అలా ఏఐ ఇచ్చిన నివేదిక ఎప్పుడైనా తప్పై.. వైద్యులు దాన్ని నమ్మి నిర్ణయం తీసుకోవడం వల్ల రోగికి ఏదైనా నష్టం జరిగితే ఆ బాధ్యత ఎవరిది? యంత్రం (లేదా) టెక్నాలజీ చెప్పినదాన్ని డాక్టర్లు ప్రశ్నించకుండా అంగీకరించడం చాలా ప్రమాదకరం. దీనిని ’ఆటోమేషన్‌ బయాస్‌’ అంటారు. ఏఐ ఎంత బాగా పనిచేస్తుందన్నదే కాదు, అది తప్పు చేసినప్పుడు డాక్టర్‌ గుర్తిస్తారా అన్నది కూడా అంతే ముఖ్యం.


డాక్టర్‌ స్థానాన్ని ఏఐ భర్తీ చేయలేదు

ఏఐ.. డాక్టర్లకు సహాయక సాధనమే తప్ప వారి స్థానాన్ని భర్తీ చేయలేదు. రోగి చెప్పే సమస్యలను వినడం, వారిని ప్రత్యక్షంగా పరీక్షించడం, గుండె, ఊపిరితిత్తుల పనితీరును నేరుగా పరిశీలించడం వంటి అంశాల్లో డాక్టర్‌ పాత్ర కీలకం. సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించడంలో ఏఐ తోడ్పడగలదుగానీ.. రోగి పరిస్థితిని సమగ్రమంగా అర్థం చేసుకుని మానవీయ స్పర్శతో చికిత్స అందించే డాక్టర్‌ అవసరం ఎప్పటికీ ఉంటుంది.

- డాక్టర్‌ చినబాబు సుంకవల్లి, సీనియర్‌ క్లినికల్‌ డైరెక్టర్‌,

సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌


ఏఐతో ఇంటి నుంచే ఆరోగ్య పర్యవేక్షణ

ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటి నుంచే రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించే అవకాశాలు పెరుగుతున్నాయి. శరీరంపై ధరించగలిగే వైద్య పరికరాలు, కనెక్టెడ్‌ ఉపకరణాల సాయంతో కీలక ఆరోగ్య సూచీలను ఇంట్లోనే చూసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో.. వీజీ అంబులెన్స్‌ల ద్వారా రోగి ఆస్పత్రికి చేరడానికి ముందే వారిని నిపుణులైన డాక్టర్లతో అనుసంధానించవచ్చు. ల్యాబ్‌ పరీక్షల్లో నమూనాల గుర్తింపు, ట్రాకింగ్‌లోనూ ఆటోమేషన్‌ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఆప్టికల్‌ సెన్సర్లు, స్పెక్ర్టోస్కోపీ, ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌తో రక్త నమూనా లేకుండానే కొన్ని ఆరోగ్య సూచీలను అంచనా వేయవచ్చు. అయితే ఇవి అన్నిరకాల రక్త పరీక్షలకూ ప్రత్యామ్నాయం కావు.

- డాక్టర్‌ కె. సుబ్బారెడ్డి,

మెడికల్‌ డైరెక్టర్‌, అపోలో హాస్పిటల్స్‌


భారతీయ డేటా.. వైద్య పర్యాటకానికి బలం

దేశ జనాభా 140 కోట్లు. అందులో కేవలం 10 శాతం మంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించి విశ్లేషించగలిగినా ప్రపంచ స్థాయి ఏఐ వైద్య నమూనాలు తయారు చేయవచ్చు. ఈ సాంకేతికత హైదరాబాద్‌ వైద్య పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు కల్పించగలదు. లండన్‌లో పదేళ్ల శిక్షణ అనుభవంతో చెపుతున్నా.. అక్కడి స్థాయి క్లిష్ట చికిత్సలు మనదగ్గర అక్కడి ఖర్చులో దాదాపు పది శాతానికే అందుతున్నాయి. హైదరాబాద్‌ ఆసుపత్రుల చికిత్సా ఫలితాలను అంతర్జాతీయ స్థాయిలో పారదర్శకంగా ప్రచురిస్తే.. అవి కూడా బ్యాంకాక్‌లోని బమ్రన్‌గ్రాడ్‌ ఆసుపత్రిలా వైద్య పర్యాటక కేంద్రాలుగా ఎదగవచ్చు.

- డాక్టర్‌ రాహుల్‌ కట్టా,

గ్రూప్‌ లీడ్‌ (ఎమర్జెన్సీ మెడిసిన్‌), స్టార్‌ హాస్పిటల్స్‌


గుండె ముప్పును పసిగడుతుందిగానీ.. కీలకం డాక్టరే

మెడికవర్‌ హాస్పిటల్స్‌లో రోగ నిర్ధారణ, చికిత్సలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని మా 550 పడకల ఆసుపత్రిలో 640-స్లైస్‌ సీటీ స్కాన్‌ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటివల్ల గుండె, ఇతర అవయవాల చిత్రాలు వేగంగా, స్పష్టంగా వస్తాయి. హైటెక్‌ సిటీలో లెవెల్‌-వన్‌ కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌తో గుండెపోటు రోగులకు వేగంగా చికిత్స అందిస్తున్నాం. కార్డియాలజీతో పాటు రేడియాలజీ, పాథాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీలో ఏఐ వినియోగం పెంచుతున్నాం. వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, అనవసర పరీక్షలు తగ్గిస్తే ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. అయితే ఏఐ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కాదు. అది డాక్టర్ల అనుభవానికి, నైపుణ్యానికి తోడ్పడే ఆధునిక సాధనం. దానిద్వారా రోగులకు మరింత వేగవంతమైన, కచ్చితమైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం

- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ,

చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 05:23 AM