Share News

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:06 AM

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు అండగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కీలకమైన పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, డిండి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కోరారు.

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Revanth Reddy Meets Modi

  • పాలమూరు, సీతమ్మసాగర్‌, డిండికి సహకరించండి

  • 3 ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వండి

  • ‘తుమ్మిడిహట్టి’ 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించండి

  • సమ్మక్క- సారలమ్మకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎన్‌వోసీ ఇప్పించండి

  • ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణకు తీరని నష్టం జరిగింది

  • భూగర్భ జలాల సంరక్షణకు రూ.5 వేల కోట్లు ఇవ్వండి

  • ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తులు

  • ఖేలో ఇండియా పోటీల నిర్వహణ అవకాశంపై కృతజ్ఞతలు

  • పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలకు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు అండగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కీలకమైన పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, డిండి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల చిక్కుముడులు విప్పేందుకు చొరవ చూపాలని, తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తు పెంపునకు మహారాష్ట్రను ఒప్పించాలని, సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇప్పించాలని విన్నవించారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో భూగర్భ జలాల సంరక్షణకు రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరారు.


తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ పోటీల నిర్వహణకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలకు తప్పకుండా హాజరు కావాలని ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం న్యూఢిల్లీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌-7లోని ప్రధాని అధికారిక నివాసంలో నరేంద్రమోదీతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానికి మూడు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయను ఆయన నివాసంలో కలిశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డి, సీఎస్‌ సంజయ్‌ జాజు ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ ఆ వివరాలను తుగ్లక్‌ రోడ్డు-23లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మంత్రులు ఉత్తమ్‌, శ్రీహరి మీడియాకు వివరించారు.


Untitled-1 copy.jpgప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇవ్వండి

తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వనరులను సాధించుకోవడంలో ఇప్పటికీ తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ తెలిపారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి భద్రతను బలోపేతం చేసేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని రేవంత్‌ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున.. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో తాను సమావేశమైన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలో ముంపునకు పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు.


సాస్కీ కింద 5 వేల కోట్లు మంజూరు చేయండి..

సాస్కీ కింద తెలంగాణకు అదనంగా రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులను వినియోగించుకుంటామన్నారు. సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జలవనరుల సంఘానికి (సీడబ్ల్యూసీ) సమర్పించామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూమి, గ్రామాల వివరాల అంచనాకు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌), బ్యాక్‌ వాటర్‌ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్థంగా ఉన్నామని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) త్వరగా జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.


అలాగే, ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన (పీఎంకేఎ్‌సవై) కింద ఇంటిగ్రేటెడ్‌ సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఇక 2026 డిసెంబరు 11 నుంచి 22 వరకు జరగనున్న ప్రతిష్ఠాత్మక 8వ ఎడిషన్‌ ఖేలో ఇండియా గేమ్స్‌ పోటీలను నిర్వహించే అవకాశం తెలంగాణకు ఇచ్చినందుకు ప్రధానికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే వేడుకల ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. 2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చరిత్ర తెలంగాణకు ఉందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్రను ఒప్పించండి.. ప్రధానికి రేవంత్ వినతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 03:36 AM