తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రను ఒప్పించండి.. ప్రధానికి రేవంత్ వినతి
ABN , Publish Date - Nov 15 , 2026 | 07:59 PM
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూనిర్వాసితులకు పరిహారం వేగంగా అందజేస్తున్నామని ప్రధానికి రేవంత్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూనిర్వాసితులకు పరిహారం వేగంగా అందజేస్తున్నామని ప్రధానికి రేవంత్ తెలిపారు. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో మోదీతో రేవంత్ ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని మోదీకి రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలో ముంపునకు అవసరమైన పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని సీఎం వివరించారు.
డాక్టర్ ఎస్.జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), డిండి ఎత్తిపోతల పథకాలపై (డీఎల్‌ఐఎస్) రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని మోదీకి రేవంత్ తెలిపారు. దీంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని చెప్పారు. పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని ఆయన కోరారు. అలాగే సాస్కీ (Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించుకుంటామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు వీలవుతుందని , ఫలితంగా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) సమర్పించామని ప్రధాని మోదీకి రేవంత్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్ లో ముంపునకు గురయ్యే భూమి, గ్రామాల వివరాలను అంచనాకు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్), బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) త్వరగా జారీ అయ్యేలా చూడాలని కోరారు. అలాగే ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
ఖేలో ఇండియా గేమ్స్‌కు రావాలని మోదీకి ఆహ్వానం
హైదరాబాద్‌లో డిసెంబరులో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను పీఎంకు అందజేసి, గేమ్స్ లోగో, మస్కట్‌ల గురించి వివరించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 7,000 మందికి పైగా అత్యుత్తమ యువ క్రీడాకారులు పాల్గొననున్నారని, భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు వారికి ఇదొక చక్కని వేదిక కానుందని సీఎం ప్రధానమంత్రికి తెలియజేశారు.
‘ఖేలో ఇండియా’ లోగో, మస్కట్ ఆవిష్కరణ
తెలంగాణ వేదికగా వచ్చే నెల 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ అధికారిక లోగో, మస్కట్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలూ చదవండి
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం