Share News

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:07 AM

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హతమయ్యాడు. హమాస్ సాయుధ విభాగమైన అల్-ఖస్సాం బ్రిగేడ్స్‌కు చెందిన రఫా బ్రిగేడ్ సీనియర్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ వైమానిక దాడిలో మరణించినట్లు హమాస్ ప్రకటించింది.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం
Samir Abu Yunis

టెల్ అవీవ్, నవంబర్ 15: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హతమయ్యాడు. హమాస్ సాయుధ విభాగమైన అల్-ఖస్సాం బ్రిగేడ్స్‌కు చెందిన రఫా బ్రిగేడ్ సీనియర్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ వైమానిక దాడిలో మరణించినట్లు హమాస్ ప్రకటించింది. నవంబర్ 14న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌కు పశ్చిమాన ఉన్న అల్-మవాసీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి ప్రణాళిక, అమలులో సమీర్ కీలక పాత్ర పోషించినట్లు హమాస్ వెల్లడించింది.


కాగా, 53 ఏళ్ల సమీర్ అబూ యూనిస్ రఫా బ్రిగేడ్ కమాండర్‌గా పనిచేశారు. 1991లో హమాస్ సాయుధ విభాగంలో చేరిన ఆయన.. రఫా ప్రాంతంలో కీలక సైనిక బాధ్యతలు నిర్వహిస్తూ కమాండర్ స్థాయికి ఎదిగారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం (IDF), అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ కూడా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తమ దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక కమాండర్ మరణించినట్లు తెలిపాయి. అయితే, మృతిచెందిన వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, సమీర్ అబూ యూనిస్ మరణం హమాస్ సైనిక నాయకత్వానికి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ గాజాలో సంస్థ కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం కాల్పుల విరమణ ఒప్పంద భవిష్యత్తుపైనా ఆందోళనలు పెంచుతోంది.


2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెలీలు మరణించగా, పలువురు బందీలుగా అపహరణకు గురయ్యారు. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యలు చేపట్టింది. 2025 అక్టోబర్‌లో అమెరికా మద్దతుతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. ఒప్పందం ప్రారంభమైనప్పటి నుంచి 1,600 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, ఏడుగురు సైనికులు సహా మొత్తం 8 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

హోర్ముజ్‌లో కలకలం.. ఒకేరోజు పేలిపోయిన మూడు చమురు ట్యాంకర్లు..

రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ఇద్దరి అరెస్టు.. ఐఎస్ఐ పాత్రపై ఆరా..

Updated Date - Nov 15 , 2026 | 10:29 AM