రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ఇద్దరి అరెస్టు.. ఐఎస్ఐ పాత్రపై ఆరా..
ABN , Publish Date - Nov 15 , 2026 | 08:32 AM
రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్ పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన దేవేంద్ర సింగ్, మహక్దీప్ కౌర్‌ను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, స్థానిక పోలీసులు, పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం అదుపులోకి తీసుకుంది.
జైపూర్, నవంబర్ 15: రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్ పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన దేవేంద్ర సింగ్, మహక్దీప్ కౌర్‌ను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), స్థానిక పోలీసులు, పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం అదుపులోకి తీసుకుంది. ఈ పేలుడు వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) హస్తం ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో నవంబర్ 3న పేలుడు సంభవించింది. 50 జీబీ గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్ కింద పేలుడు జరగడంతో పట్టాలకు ఆధారంగా ఉన్న సిమెంట్ స్లీపర్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు ముందే ఆ మార్గంలో రైలు వెళ్లిపోవడంతో ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే, నిందితులకు పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఆదేశాలు అందినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. 'షా' అనే వ్యక్తి వారికి పేలుడుకు సంబంధించిన బాధ్యతలను అప్పగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అలాగే, మహక్దీప్ కౌర్ బ్యాంకు ఖాతాకు పాక్ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో ఐఎస్ఐ ప్రమేయం ఉందా? అనే అంశంపైనా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఆయుధాలు, తూటాలు స్వాధీనం
కాగా, అరెస్టయిన ఇద్దరి నిందితుల నుంచి రెండు పిస్టళ్లు, 46 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు ఘటనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆయుధాల సరఫరా వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అలాగే, నిందితులకు సహకరించినట్లు అనుమానిస్తున్న మరికొందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ పోలీసులు, ఏటీఎస్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. ఈ పేలుడు వెనుక ఉన్న అసలు కుట్ర, నిధులు సమకూర్చిన వ్యక్తులు, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
హోర్ముజ్‌లో కలకలం.. ఒకేరోజు పేలిపోయిన మూడు చమురు ట్యాంకర్లు..
రామ్‌లీలా మైదానంలో ఇకపై 50 వేల మందికే అనుమతి