హోర్ముజ్‌లో కలకలం.. ఒకేరోజు పేలిపోయిన మూడు చమురు ట్యాంకర్లు..
ABN , Publish Date - Nov 15 , 2026 | 07:11 AM
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో ఒకే రోజు మూడు చమురు ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో ఒకే రోజు మూడు చమురు ట్యాంకర్లు పేలిపోయి మంటల్లో చిక్కుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. నవంబర్ 14న మూడు చమురు ట్యాంకర్లు సముద్రంలో అమర్చిన నౌకాదళ మైన్లను ఢీకొన్నాయని ఇరాన్ నౌకాదళం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించాయి. ఈ పరిణామం అంతర్జాతీయ సముద్ర రవాణా, చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనను పెంచుతోంది.
తొలుత తూర్పు హోర్ముజ్ ప్రాంతంలో ఒక చమురు ట్యాంకర్ మందుపాతరను ఢీకొని మంటల్లో చిక్కుకుందని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఆ తర్వాత దక్షిణ హోర్ముజ్ ప్రాంతంలో మరో రెండు ట్యాంకర్లు మైన్లను ఢీకొని పేలిపోయాయని పేర్కొంది. ఈ రెండు నౌకలు అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తున్నాయని, వాటి రాడార్, నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేశాయని ఐఆర్జీసీ ఆరోపించింది. వాటిలో ఒకటి సూపర్ ట్యాంకర్ అని తెలిపింది. ప్రమాదానికి గురైన మూడు నౌకల పేర్లు, అవి ఏ దేశానికి చెందినవి, వాటిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే వివరాలను ఇప్పటివరకు ఇరాన్ వెల్లడించలేదు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టం, సిబ్బంది పరిస్థితిపైనా స్పష్టత లేదు.
ప్రపంచ ఇంధన రవాణాలో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో అనుసంధానించే ఈ మార్గం ద్వారా పెద్దఎత్తున చమురు, సహజ వాయువుల సరఫరా జరుగుతుంటుంది. ఈ మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయంగా చమురు సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే, రవాణా భద్రతపై అనుమానాలు పెరిగితే నౌకల బీమా ఖర్చులు, రవాణా వ్యయాలూ పెరిగే అవకాశం ఉంది. కాగా, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. తమ అనుమతి లేకుండా నిషేధిత మార్గాల్లో ప్రయాణించే నౌకలపై చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు సముద్రంలో మందుపాతరలను అమర్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికాలో స్తంభించిన విమాన సేవలు
హసీనాను తీసుకెళ్లండి, కానీ.. సైనిక విమానంతో రండి