హసీనాను తీసుకెళ్లండి, కానీ.. సైనిక విమానంతో రండి
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:09 AM
బంగ్లాదేశ్‌కు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తరలింపు విషయంలో భారత్ స్పందించింది. ఆమెను వెనక్కి పంపించడానికి రెండు షరతులు విధించింది.
మరణశిక్షపై అప్పీల్‌కు, కొత్తగా విచారణకు హామీ ఇవ్వండి
బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు
న్యూఢిల్లీ, నవంబరు 14 : బంగ్లాదేశ్‌కు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తరలింపు విషయంలో భారత్ స్పందించింది. ఆమెను వెనక్కి పంపించడానికి రెండు షరతులు విధించింది. హసీనా కోసం సైనిక విమానం పంపించాలనేది తొలి షరతు. తనకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునేందుకు, కొత్తగా విచారణకు హామీ ఇవ్వాలనేది రెండో షరతు. ఈ షరతులు పూర్తిచేసి ఆమెను తమ వెంట తీసుకెళ్లవచ్చునని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత్ స్పష్టం చేసిందని ‘బీబీసీ బంగ్లా’ కథనం ప్రచురించింది. బంగ్లాదేశ్‌లో 2024 జూన్-ఆగస్టు నెలల్లో జరిగిన ఆందోళనల ఫలితంగా అప్పటి ప్రధాని హసీనా ఆ దేశం వదిలిపెట్టి, భారత్‌కు రావాల్సి వచ్చింది. ఇన్నాళ్లుగా మన ప్రభుత్వం సంరక్షణలోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లోని ట్రైబ్యునల్ ఇటీవలే ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో.. తన దేశం తిరిగి వెళ్లి న్యాయ పోరాటం చేపట్టాలని హసీనా నిర్ణయించారు. డిసెంబరులో తిరిగి వెళ్లేందుకు వీలుగా కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు పత్రం కోసం దరఖాస్తు చేశారు.
‘రాయిటర్స్’ వార్తా సంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ఆమె ధ్రువీకరించారు. అయితే, భారత్‌తో తమకు ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారమే ఆమె బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాల్సి ఉంటుందని బంగ్లా ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఆమె దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే భారత్ స్పందించింది. హసీనాను తిరిగి పంపడానికి అభ్యంతరం లేదంటూనే, బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి రెండు అంశాల్లో హామీని కోరింది. ఆమె భారత్‌కు నాడు మిలిటరీ విమానంలో వచ్చారు. ఆ విషయం ప్రస్తావిస్తూ, అదే పద్ధతిలో తిరిగి తీసుకెళ్లాలని భారత్ కోరింది. 2024 ఆందోళనల్లో భాగంగా జరిగిన హింస, హత్యాకాండలపై విచారించిన ట్రైబ్యునల్ హసీనా పరోక్షంలో ఆమెకు మరణశిక్ష విధించింది. ఆ విషయం గుర్తుచేస్తూ, ఆమె తన వైపు వాదనలు వినిపించేందుకు చట్టబద్ధ అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది.