కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్..
ABN , Publish Date - Nov 15 , 2026 | 07:24 AM
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌లకు ఇప్పుడు భయం పట్టుకుంది. అజ్ఞాత వ్యక్తుల కాల్పులు, భారత్ నుంచి మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వీరిద్దరినీ సేఫ్ హౌస్‌లకు తరలించినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌లకు ఇప్పుడు భయం పట్టుకుంది. అజ్ఞాత వ్యక్తుల కాల్పులు, భారత్ నుంచి మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వీరిద్దరినీ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న రహస్య స్థావరాలకు తరలించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసిన పలువురు ఉగ్రవాదులు అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో ఇటీవల హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్‌తో పాటు ఈ పరిణామాలు కూడా హఫీజ్ సయీద్, మసూద్ అజర్ భద్రతపై ఆందోళన పెంచినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి (Terrorists Pakistan Safe Houses).
లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ (Hafiz Saeed)ను లాహోర్‌లోని జోహర్ టౌన్ నుంచి రావల్పిండిలోని గ్యారిసన్ గ్రౌండ్ ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంటుంది. తన సంస్థకు చెందిన కార్యకర్తలు, ముఖ్య నాయకులను నేరుగా కలవడం కూడా హఫీజ్ సయీద్ తగ్గించుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆడియో సందేశాల ద్వారానే వారితో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసుల్లో లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో హఫీజ్ సయీద్ శిక్ష అనుభవిస్తున్నట్లు పాకిస్థాన్ చెబుతోంది. కానీ భారత నిఘా వర్గాలు ఈ వాదనను ఖండిస్తున్నాయి. అతడు జైలులో కాకుండా భద్రత కల్పించిన రహస్య ప్రాంతంలో ఉంటున్నట్లు ఆరోపిస్తున్నాయి.
జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ (Masood Azhar)ను సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాకు తరలించినట్లు సమాచారం. అక్కడ ఐఎస్ఐ ఆధ్వర్యంలోని అత్యంత భద్రత కలిగిన రహస్య స్థావరంలో ఉంచినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మసూద్ అజర్ కూడా తన సంస్థకు చెందిన సభ్యులను నేరుగా కలవడం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కొంతమంది ముఖ్య నాయకులు, సన్నిహితులతో మాత్రమే అతడు సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ఇద్దరినీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించింది. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడులతో పాటు పలు దాడుల కేసుల్లో హఫీజ్ సయీద్ భారత్‌కు కావాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. మసూద్ అజర్‌పై 2001 పార్లమెంట్ దాడి, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా దాడులకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం