చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:05 AM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని సుసాధ్యం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని సుసాధ్యం చేసింది. భూమి చుట్టూ తిరిగి వచ్చిన భారీ స్టార్‌షిప్ అంతరిక్ష నౌకను గాల్లోనే స్టార్ బేస్ యంత్రం పట్టుకుంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న స్టార్‌బేస్ ప్రయోగ కేంద్రంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. పూర్తిగా తిరిగి ఉపయోగించుకోగల రాకెట్ వ్యవస్థ అభివృద్ధిలో ఇది చారిత్రాత్మక ముందడుగుగా నిలిచింది. స్పేస్ఎక్స్ చేపట్టిన 15వ స్టార్‌షిప్ పరీక్షా ప్రయోగంలో ఈ ఘనత సాధించింది (SpaceX Starship).
అంతరిక్షంలోకి వెళ్లి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన స్టార్‌షిప్ తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకుంది. అనంతరం టెక్సాస్‌లోని స్టార్‌బేస్ ప్రయోగ కేంద్రం వైపు దూసుకొచ్చింది. అక్కడ ప్రయోగ వేదికకు అమర్చిన రెండు భారీ యాంత్రిక చేతులు దాన్ని సురక్షితంగా పట్టుకున్నాయి. ఈ చేతులను 'చాప్‌స్టిక్స్' అని పిలుస్తారు. స్టార్‌షిప్ నెమ్మదిగా కిందకు దిగుతూ ఈ రెండు చేతుల మధ్యకు చేరుకోవడం, అవి దాన్ని పట్టుకోవడం చూసి అక్కడున్న ప్రేక్షకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష నౌకను సముద్రంలో పడవేయకుండా, తిరిగి ప్రయోగ కేంద్రంలోనే పట్టుకోవచ్చని స్పేస్ఎక్స్ నిరూపించింది (Starship Catch).
ఈ ప్రయోగంలో స్టార్‌షిప్ దాదాపు 22 గంటల పాటు ప్రయాణించింది. భూమి చుట్టూ 14 సార్లు తిరిగింది. ఈ ప్రయోగం పూర్తయిన తర్వాత స్టార్‌షిప్ తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఏర్పడే తీవ్రమైన వేడిని తట్టుకుని, నిర్ణీత మార్గంలో ప్రయాణించి స్టార్‌బేస్‌కు చేరుకుంది. అక్కడే యాంత్రిక చేతులు దాన్ని పట్టుకున్నాయి. ఇప్పటివరకు స్పేస్ఎక్స్ తన సూపర్ హెవీ బూస్టర్ రాకెట్లను మూడు సార్లు ఇదే రీతిలో విజయవంతంగా పట్టుకుంది. అయితే అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ప్రధాన స్టార్‌షిప్ నౌకను తిరిగి పట్టుకోవడం మాత్రం ఇదే తొలిసారి (Starlink Satellites).
ఈ చారిత్రక విజయంపై ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తం చేశారు (Musk on Mars Mission). స్పేస్ఎక్స్ బృందాన్ని అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. యాంత్రిక చేతుల మధ్య వేలాడుతున్న స్టార్‌షిప్ వీడియోలను పంచుకున్నారు. నౌక అద్భుతంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. నాసా కూడా ఈ విజయాన్ని అభినందించింది. నాసా అధిపతి జారెడ్ ఐజాక్మన్ ఈ ప్రయోగాన్ని దాదాపు మాయాజాలంలా అభివర్ణించారు. చంద్రుడిపైకి మానవులను పంపే లక్ష్యానికి ఇది మరో ముందడుగని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..