పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రధాని మోదీకి వినతి.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:34 PM
తెలంగాణలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సహకారం కోరుతూ ప్రధాని మోదీని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసింది. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు.
ఢిల్లీ, నవంబర్ 15: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సహకారం కోరడంతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీటి పరిస్థితులు, రైతుల ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను వివరించారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్: తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని, దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెంచాల్సిన అవసరాన్ని ప్రధానికి పూసగుచ్చినట్లు వివరించామని పేర్కొన్నారు.
సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్: ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (NOC) అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.
చనాక కొరాట బ్యారేజీ: ఈ ప్రాజెక్టు కోసం రూ. 103 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు 70 శాతం మేర పూర్తయ్యాయని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరినట్లు వెల్లడించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎల్లుండి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన వివిధ హామీలపై కూడా ప్రధానితో చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.
గతంలో మేడిగడ్డ బ్యారేజీ కూలడంతో గోదావరి నీళ్లు దిగువకు వెళ్ళిపోయాయని, ప్రస్తుతం దేవాదుల, సీతారామ ప్రాజెక్ట్‌ల వద్ద నీటిని లిఫ్ట్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాసంగి సీజన్లో రైతులు వరి పంట వేయొద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో ప్రస్తుత ‘ఎల్‌నినో’ (El Nino) పరిస్థితుల కారణంగా తలెత్తిన వాతావరణ మార్పులను ప్రధానికి వివరించామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలకు పునరుజ్జీవనం కల్పించేందుకు రూ. 5,000 కోట్ల ప్రత్యేక కేంద్ర సాయాన్ని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎలాంటి నీటి కొరత లేదని, భవిష్యత్తులో కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.(Uttam Kumar Reddy PM Modi irrigation)
ఈ వార్తలూ చదవండి
చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం