ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:34 AM
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల చైర్మన్ రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల చైర్మన్ రాధాకృష్ణకు
ఎమ్మెల్సీ పదవి అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం
సంస్థ కొత్త కార్యాలయాన్ని ఇటీవల సందర్శించిన సీఎం
ఆ ఫొటోతో, ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనాలు
అలాంటి వార్తలు సృష్టిస్తున్న, వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరిక
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల చైర్మన్ రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలు ఇటీవల కొత్త కార్యాలయంలోకి ప్రవేశించిన నేపథ్యంలో అభినందనలు తెలపడానికి సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయానికి వచ్చారు. దానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. నూతన కార్యాలయాన్ని సందర్శించిన రేవంత్‌రెడ్డి.. చైర్మన్ వేమూరి రాధాకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, జేఎండీ అనూష, డైరెక్టర్ శ్రుతికీర్తికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంతో వారు ఫొటో దిగగా.. ఆ ఫొటోతో కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. రాధాకృష్ణకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వనుందంటూ ఆంధ్రజ్యోతిలోనే వార్తను ప్రచురించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలను ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తీవ్రంగా పరిగణిస్తోంది. గిట్టనివారు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తోంది. ఫేక్ వార్తలు సృష్టిస్తున్న, వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News