‘అనంత’మైన ఆస్తులు.. సంపాదనంతా ఉద్యోగంలో చేరాకే!
ABN , Publish Date - May 22 , 2026 | 09:17 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడిన వాటర్‌బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌కు బోర్డులో ఉలుకరూ.. పలుకరూ అనే పేరుంది.
హైదరాబాద్ సిటీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల పట్టుబడిన వాటర్‌బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌కు బోర్డులో ఉలుకరూ.. పలుకరూ అనే పేరుంది. తన విభాగంలో పని చేసేవారితో తప్పా, ఇతరులతో మాట్లాడేవారు కాదట. ముడుపు దక్కితే కానీ, ఫైల్ కదిపేవారు కాదని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఆయన ఆస్తులన్నీ ఉద్యోగంలో చేరాకే సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
1991లో అనంత లక్ష్మీకుమార్ వాటర్‌బోర్డులో టెక్నికల్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత జేఎన్‌టీయూ నుంచి బీటెక్, ఎంటెక్ డిగ్రీలు పూర్తి చేశారు. 2003లో మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2010లో సికింద్రాబాద్‌లోని మారేడుపల్లిలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఆపరేషన్ మెయింటనెన్స్ విభాగంలో పని చేశారు. 2021లో జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందగా.. ప్రాజెక్టు డివిజన్‌లో పనిచేస్తున్నారు. జనరల్ మేనేజర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) అన్నమాట.
పనుల ప్రతిపాదన దగ్గర నుంచి పూర్తి చేయించే వరకు పూర్తిగా ఆయనదే బాధ్యత. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు వచ్చేలా తెరవెనుక పావులు కదిపేవారని తెలిసింది. రెడ్‌హిల్స్ ప్రాజెక్టు డివిజన్ జీఎంగా పనిచేస్తున్న కుమార్ కార్వాన్, నాంపల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్ పరిధిలో జరుగుతున్న సీవరేజ్ నెట్‌వర్క్ విస్తరణ పనుల్లో కీలకంగా పని చేస్తున్నారు. ఈ పనుల్లో ప్రముఖ నిర్మాణ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది.
దాంతో పాటు పలు తాగునీటి పైపులైన్లు, సీవరేజ్ నెట్‌వర్క్ పనుల్లో కాంట్రాక్టర్లు ముడుపులు చెల్లించేంత వరకు ఫైల్ కదిలించకపోయేదని సమాచారం. కుమార్ భార్య గృహిణి కాగా. కుమార్తెలు కూడా ఉద్యోగులు కాదు. అయినా ఈ స్థాయిలో ఆదాయం ఎలా సంపాదించారనే దానిపై ఏసీబీ ఆధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల ప్రముఖ ఆస్పత్రి డైరెక్టర్ కుమారుడితో చిన్న కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ వివాహ వీడియోను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News