Share News

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

ABN , Publish Date - May 22 , 2026 | 07:44 AM

హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి.

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌
Water Tankers Demand, Hyderabad

  • భూగర్భజలాలు అడుగంటడమే కారణం

  • కొండాపూర్‌లో సాధారణ రోజుల్లో 60 బుకింగ్‌

  • ప్రస్తుతం 350 వరకు బుకింగ్‌

  • అర్ధరాత్రి వరకు నీటి సరఫరా

హైదరాబాద్: నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో కొండాపూర్‌లో నీటి సరఫరాకు డిమాండ్‌ పెరిగింది. తాగునీటి కష్టాలను అధిగమించేందుకు ప్రజలు ట్యాంకర్లను బుక్‌ చేసుకుంటున్నారు. కొండాపూర్‌ డివిజన్‌లోని తులీప్‌ కమ్యూనిటీ, మసీద్‌బండ వద్ద ఉన్న రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ల నుంచి జలమండలి అధికారులు అర్ధరాత్రి 12 గంటల వరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు.


ఆరింతలు రెట్టింపు..

కొండాపూర్‌ డివిజన్‌లో వాటర్‌ ట్యాంకర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు ఇన్‌పుట్‌ తగ్గడం, అవుట్‌పుట్‌ పెరగడంతో నీటి సరఫరాలో అంతరాయం పెరుగుతుంది. రెండు నెలల క్రితం ఒక్కో పాయింట్‌ వద్ద ప్రతీ రోజు 40నుంచి 60 ట్యాంకర్లు బుకింగ్‌ అయ్యేవి. ప్రస్తుతం ఎండలు ముదిరిపోవడంతో డిమాండ్‌ పెరిగి ఒక్కో పాయింట్‌ వద్ద 200 నుంచి 350 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అంటే గడిచిన రెండు నెలల్లో ట్యాంకర్లకు ఆరింతల డిమాండ్‌ పెరిగిందన్నమాట. మరో నెల రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ట్యాంకర్లకు డిమాండ్‌ పెరగడంతో ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా చేసే నీటిని 40నిమిషాలకు కుదించారు. కాలనీ వాసులకు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొత్తం మీద వేసవికాలం ముగిసే వరకు ఈ నీటి తిప్పలు తప్పేలా లేవు.


city1.2.jpgసమప్రాధాన్యం ఇస్తున్నాం

నెల రోజుల నుంచి వాటర్‌ ట్యాంకర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. రాత్రి 12 గంటల వరకు ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. అన్ని కాలనీలకు, అపార్టుమెంట్లకు సమప్రాధాన్యం ఇస్తూ నీటి సరఫరాను నియంత్రిస్తున్నాం. అయితే ప్రజలు కూడా సహకారం అందించాలి. ముఖ్యంగా నీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకు మాత్రమే వాడుకోవాలి. నల్లాలకు రోజు విడిచి రోజు 40 నిమిషాల పాటు మాత్రమే సరఫరా చేస్తున్నాం.

  • సందీప్‏కుమార్‌, జలమండలి మేనేజర్‌, మసీద్‌బండ డివిజన్‌


బుకింగ్‌ చేసినా రావట్లేదు

నీటి సరఫరాలో తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతోంది. ట్యాంకర్లను బుక్‌ చేసినప్పటికీ కొన్ని సార్లు రావడం లేదు. ట్యాంకర్లపై అధికారుల నియంత్రణ ఉండాలి. ఒక్కోసారి బుక్‌ చేయని వారికి కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా నీటి వాడకాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించాలి.

  • నాగరాజు, స్థానికుడు


ఈ వార్తలు కూడా చదవండి:

నిలకడగా బంగారం, వెండి ధరలు..

అధికం... పురుషోత్తమం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 08:06 AM