Share News

అధికం... పురుషోత్తమం

ABN , Publish Date - May 22 , 2026 | 02:33 AM

మన దేశంలో అనుసరించే కాల గణన విధానాల్లో సౌరమానం, చాంద్రమానం ప్రధానమైనవి. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోజుల కొన్ని గంటలు, చాంద్రమానం...

అధికం... పురుషోత్తమం

విశేషం

మన దేశంలో అనుసరించే కాల గణన విధానాల్లో సౌరమానం, చాంద్రమానం ప్రధానమైనవి. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోజుల కొన్ని గంటలు, చాంద్రమానం ప్రకారం ఏడాదికి 354 రోజుల కొన్ని గంటలు ఉంటాయి. ఈ రెండిటి మధ్యా ఉన్న వ్యత్యాసం దాదాపు 11 రోజులు. దాన్ని భర్తీ చేయడం కోసం పూర్వులు రూపొందించిన విధానమే అధిక మాసం. ఇది రెండున్నర ఏళ్ళ నుంచి మూడేళ్ళకు ఒకసారి వస్తుంది. ప్రస్తుతం అధిక జ్యేష్ట మాసం నడుస్తోంది. అధిక మాసాన్ని ‘పురుషోత్తమ మాసం’ అని కూడా అంటారు.

వరమిచ్చిన శ్రీహరి

పురుషోత్తమ (అధిక) మాసం, దాని విశిష్టతకు సంబంధించిన ఆసక్తికరమైన కథ ‘పద్మపురాణం’లో కనిపిస్తుంది. దాని ప్రకారం... పూర్వం దైవ సంకల్పంతో ఒక మాసం అధికంగా ఏర్పడింది. అధికమాసంలో (సౌరమానం ప్రకారం) మాస సంక్రాంతి ఉండదు. మాసాధిపతి ఉండరు. దాంతో అందరూ దాన్ని ‘మల మాసం’ అని, ‘అపవిత్ర మాసం’ అని పిలవసాగారు. ఈ అవమానాన్ని భరించలేక ఆ మాసం... వైకుంఠంలోని శ్రీమహావిష్ణువును దర్శించి... ‘‘స్వామీ! లోకులు నన్ను ‘మలమాసం’ అంటున్నారు. ఇతర మాసాలు కూడా అవమానిస్తున్నాయి. నాకు అధిపతి లేడు. గౌరవ మర్యాదలు లేవు. నా గతి ఏమిటి?’’ అని మొరపెట్టుకుంది. అప్పుడు మహా విష్ణువు... అహం చైవ యథా లోకే పురుషోత్తమ ఇత్యుతే /తథాయమపి లోకేషు పురుషోత్తమ నామకః / మత్స సాదృశ్యమగమత్‌ మాసానామధిపో భవత్‌/ జగత్పూజ్యో జగద్వంద్యో మాసో యం చ భవిష్యతి... లోకులందరూ నన్ను పురుషోత్తముడని ఏ విధంగా పిలుస్తున్నారో... నిన్ను (అధికమాసం) కూడా ‘పురుషోత్తమ మాసం’ అనే పేరుతో వ్యవహరిస్తారు. నువ్వు నా సారూప్యతను పొందుతావు. అన్ని మాసాలకు అధిపతివి అవుతావు. భవిష్యత్తులో సకల జగత్తుతో పూజలు అందుకుంటావు’’ అని వరం ఇచ్చాడు. నాటి నుంచి అధిక మాసాన్ని ‘పురుషోత్తమ మాసం’గా వ్యవహరిస్తున్నారు.


మాసాలన్నిటిలోనూ పురుషోత్తమ మాసం దివ్యమైనదనీ, ఈ మాసంలో చేసే దానాలు, జపాలు, పుణ్య కార్యాలకు ఎన్నో రెట్లు ప్రతిఫలం లభిస్తుందనీ, ఈ మాసంలో మహా విష్ణువును పూజిస్తే... మోక్షం కలుగుతుందనీ ‘స్కాంద పురాణం’ చెబుతోంది. అధికమాసంలో ఆచరించాల్సిన, చేయకూడని పనులను పూర్వులు నిర్దేశించారు. నిత్య కర్మలు, పూజలు, దానాలు ఈ మాసంలో విధిగా చేసుకోవాలనీ. శుభకార్యాలు, యాగాలు లాంటివి చేయకూడదని, మహా విష్ణువును పూజించాలని పేర్కొన్నారు. అలాగే... ఉపవాసాలు, రోజూ దీపారాధన, విష్ణు సహస్రనామం, పురుషసూక్తాల పారాయణ అపరిమితమైన ఫలాన్ని అందిస్తాయన్నది పెద్దల మాట.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 02:33 AM