కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
ABN , Publish Date - May 21 , 2026 | 12:18 PM
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు.
కృష్ణాజిల్లా, మే 21: గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు తెరిపించి రికార్డులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యులు ఎవరూ అందుబాటులో లేమంటూ ఫోన్లో సమాధానం చెప్పడంతో ఏసీ లలిత విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడం ఏంటని ట్రస్ట్ సభ్యులపై లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏసీ లలిత.. పూర్తి వివరాలు సేకరించారు. దేవాదాయ శాఖ కమిటీ పరిధిలో ట్రస్ట్ లేకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతున్నామని స్పష్టం చేశారు. రికార్డులు పరిశీలించిన తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని వెల్లడించారు. బంగారు కిరీటం తాకట్టు వ్యవహారంలో ట్రస్ట్ కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విచారణ ముమ్మరం చేశారు. మధ్యాహ్నంలోపు విచారణ నివేదిక అందించాల్సి ఉండటంతో ఏసీ లలిత ఆలయంలోనే వేచి ఉన్నారు. ఈ వ్యవహారంలో తాకట్టు కొట్టు వ్యాపారి పరారీలో ఉన్నాడు. తన ఖాతాకు తాకట్టు డబ్బులు జమ చేస్తేనే ఊరికి వస్తానని ట్రస్ట్ బోర్డుకు తాకట్టు వ్యాపారి సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
ట్రస్ట్ సభ్యులకు యలవర్తి శ్రీనివాసరావు హెచ్చరిక
విచారణ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆలయానికి చేరుకున్నారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చేసిన తప్పిదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల గుడివాడకు చెడ్డపేరు వస్తోందని కమిటీ సభ్యులకు ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. కిరీటాన్ని స్వామివారికి అలంకరించాలని భక్తుల తరఫున డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులు స్పందించకపోవడంతో కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే కూర్చుంటానని యలవర్తి స్పష్టం చేశారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న బంగారు వ్యాపారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవుడి విషయంలో జరిగిన అపచారం భక్తులను కలచివేసిందని, దీనిపై ఉన్నత స్థాయికి వెళ్తానని హెచ్చరించారు. సాయంత్రంలోపు కిరీటం అలంకరించకపోతే భక్తులతో కలిసి యాక్షన్ ప్లాన్‌లో దిగుతామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదని యలవర్తి శ్రీనివాసరావు హెచ్చరిక జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
గుంటూరులో అగ్నిప్రమాదం.. డ్రైనేజీ పైపుల దగ్ధం
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
Read Latest AP News And Telugu News