శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:34 AM
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంతం, లడ్డూ కౌంటర్, అఖిలాండం, అన్నప్రసాద భవనం, ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లలో రద్దీ నెలకొంది.
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల, నవంబరు2(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంతం, లడ్డూ కౌంటర్, అఖిలాండం, అన్నప్రసాద భవనం, ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లలో రద్దీ నెలకొంది. రింగ్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. వాహనాలు అధికంగా రావడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరుమలలో ట్రాఫిక్ సమస్యలు కనిపించాయి. ఇక, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, గదులు కేటాయించే సీఆర్వో, పద్మావతి, ఎంబీసీ కౌంటర్లూ భక్తులతో కిటకిటలాడాయి. సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథిగృహం నుంచి శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ ఆలయం, ఆక్టోపస్ భవనం సర్కిల్ మీదుగా కల్యాణవేదిక వరకు వ్యాపించింది. వీరికి 24 గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు టైంస్లాట్ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు కూడా దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది.