Share News

ట్రై కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ

ABN , Publish Date - Oct 02 , 2026 | 10:38 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది.

ట్రై కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ
Police Commissionerates

  • జోన్లు, డివిజన్లకు అనుగుణంగా పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లో మార్పులు

  • ఆర్‌జీఐఏ ఇక శంషాబాద్‌.. చిక్కడపల్లి స్థానంలో కాచిగూడ

  • కొత్తగా ఉప్పల్‌ లా అండ్‌ ఆర్డర్‌ ట్రాఫిక్‌ డివిజన్‌

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. పోలీసింగ్‌ను మరింత సమర్ధవంతంగా నిర్వహించడం, ప్రజలకు వేగంగా సేవలు అందించడం, పర్యవేక్షణను మెరుగుపరచడం, శాంతిభద్రతలను పటిష్టం చేయడం లక్ష్యంగా జోన్లు, డివిజన్లు, లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు, మహిళా పోలీస్‌ స్టేషన్లు, ట్రాఫిక్‌ విభాగాల పరిధులను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్‌ 84ను సెప్టెంబరు 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున ప్రిన్సిపల్‌ సెక్రటరీ శిఖా గోయల్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి కొత్త పరిధులు అమలులోకి వస్తాయని శిఖాగోయల్‌ స్పష్టం చేశారు.


ఆర్‌జీఏఐ ఇకపై శంషాబాద్‌

శంషాబాద్‌ పరిధిలో తొండుపల్లి, గొల్లపల్లి, ఘన్‌స్మియాపూర్‌, హమీదుల్లానగర్‌, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, శంకరాపూర్‌, బహదూర్‌గూడ, రషీద్‌గూడ, గండిగూడ, సంగిగూడ, లక్ష్మీ తండా, కొత్వాల్‌గూడలోని కొంత ప్రాంతం, పోశెట్టిగూడ తదితర గ్రామాలను ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌ పరిధిలోకి చేర్చారు. ఆర్‌జీఏఐ పోలీస్టేషన్‌కు శంషాబాద్‌ పోలీస్టేషన్‌గా పేరు మార్చారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐ) డివిజన్‌ను శంషాబాద్‌ డివిజన్‌గా పేరు మార్చారు. అలాగే చిక్కడపల్లి డివిజన్‌కు కాచిగూడ డివిజన్‌గా, సంతోష్ నగర్‌ డివిజన్‌కు ఛత్రినాక డివిజన్‌గా కొత్త పేర్లు నిర్ణయించారు. అంతేకాకుండా బడంగ్‌పేట్‌ పోలీస్టేషన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మల్కాజిగిరి కమిషనరేట్‌, ఎల్‌బీనగర్‌ జోన్‌ పరిధిలోని కొన్ని గ్రామాలను అదిభట్ల పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.


city6.3.jpgలా అండ్‌ ఆర్డర్‌ స్టేషన్‌లకు అనుగుణంగా..

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లోని ట్రాఫిక్‌ విభాగాల పరిధులను కూడా పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. వివిధ లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లకు అనుగుణంగా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధులను సవరించారు. అబిడ్స్‌, పంజాగుట్ట, సైఫాబాద్‌, సుల్తాన్‌బజార్‌, చిక్కడపల్లి, చిలకలగూడ, గాంధీనగర్‌, మహంకాళి, కాచిగూడ, చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఛత్రినాక, మలక్‌పేట్‌, సైదాబాద్‌, సంతోష్ నగర్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ తదితర ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేశారు. అదే విధంగా మహిళా పోలీస్ స్టేషన్లను కూడా ఆయా జోన్లకు అనుగుణంగా పరిధులను మార్చారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌ జోన్‌లకు అనుగుణంగా సైబర్‌ సెల్‌ విభాగానికి పరిధి కేటాయించారు.


సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో..

అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి అమీన్‌పూర్‌, బీరంగూడ, దీకే బావి, ఇలాపూర్‌, ఇలాపూర్‌ పెద్ద తండా, ఇలాపూర్‌ చిన్న తండా, కిస్తారెడ్డిపేట, పటేల్‌గూడ, సుల్తాన్‌పూర్‌, దయారా, బొమ్మనకుంట, గండిగూడెం, వడక్‌పల్లి, జనకంపేట, బొల్లారం మున్సిపాలిటీలో కొన్ని వార్డులు, గాంధీనగర్‌, లక్ష్మీనగర్‌,, వడ్డెర కాలనీ, జ్యోతినగర్‌, బాలాజీనగర్‌, బీరప్ప బస్తీ, చర్చి బస్తీ, శ్రీరామ్‌నగర్‌, హనుమాన్‌ టెంపుల్‌, వడ్ల బస్తీ, ఓల్డ్‌ విలేజ్‌, వినాయక్‌నగర్‌, మల్లన్నబస్తీ తదితర ప్రాంతాలు చేర్చారు.


మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో..

మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా ఉప్పల్‌ లా అండ్‌ ఆర్డర్‌ జోన్‌తో పాటు ట్రాఫిక్‌ జోన్‌ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా అల్వాల్‌, మేడిపల్లి డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. బేగంపేట్‌ జోన్‌ను రద్దు చేశారు. జవహర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కోవ్కూర్‌ గ్రామం, సింగాయిపల్లి, హకీంపేట్‌, భారత్‌నగర్‌, వాంబే కాలనీ, ప్రశాంత్‌నగర్‌, మల్కారం, ఫరా్‌హనగర్‌ కాలనీ, మల్లెలగూడ, బిట్స్‌ పిలానీ, డంపింగ్‌ యార్డ్‌, సింగాయిపల్లి, కార్మికనగర్‌, శాంతినగర్‌, ధరణి ఎన్‌క్లేవ్‌లు, మల్కాజిగిరి డివిజన్‌లలో చేర్చారు. మెట్టుగూడలోని కొన్ని ప్రాంతాలను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని చిలకలగూడ పోలీస్టేషన్‌లో కలిపారు.


city6.jpgకొత్త డివిజన్‌లు

తిరుమలగిరి, పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాలను కలిపి కొత్తగా అల్వాల్‌ డివిజన్‌ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఉప్పల్‌, మేడిపల్లి డివిజన్లు ఏర్పాటు చేశారు. మీర్‌పేట్‌ పోలీస్టేషన్‌లోని పలు ప్రాంతాలను వనస్థలిపురం పోలీస్టేషన్‌ పరిధిలోకి చేర్చారు. అదే విధంగా బేగంపేట్‌, ఉప్పల్‌, సరూర్‌నగర్‌ మహిళా పోలీస్టేషన్‌ల పరుధులను కొత్త జోన్‌లు, డివిజన్‌లకు అనుగుణంగా మార్చారు. మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌, తిరుమలగిరి ట్రాఫిక్‌ డివిజన్‌లతో పాటు కొత్తగా ఉప్పల్‌ ట్రాఫిక్‌ డివిజన్‌ ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌ పరిధిలో ఉప్పల్‌, కుషాయిగూడ, ఘటకేసర్‌ పోలీస్టేషన్‌లు చేర్చారు.


పలు పోలీస్‏స్టేషన్ల పరిధులు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌ పరిధిని విస్తరించారు. ప్రస్తుతం ఉన్న పరిధికి అదనంగా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రాంతాన్ని ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. అదే విధంగా కొన్ని ప్రాంతాలను కలిపి ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధి విస్తరించారు. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తొర్రూర్‌, కోహెడ, బ్రాహ్మణపల్లి, మునగనూర్‌ గ్రామాలను అదిభట్ల పోలీస్‏స్టేషన్‌ పరిధిలోకి చేర్చారు. అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్‏స్టేషన్‌ పరిధిలోని మంగల్‌పల్లి, రాందాస్‏పల్లి, చింతపల్లిగూడ, సాహెబ్‌గూడ, ఫిరోజ్‌గూడ గ్రామాలను కూడా అదిబట్ల పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. మహేశ్వరం గేట్‌ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్‌ నేటి నుంచి అమలులోకి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 10:38 AM