Share News

హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్‌ నేటి నుంచి అమలులోకి..

ABN , Publish Date - Oct 02 , 2026 | 07:19 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాలో సరికొత్త డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆర్టీసీ, మెట్రోకి సంబంధించిన ‘కామన్‌ మొబిలిటీ కార్డు’ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ నగరవాసులకు శుభవార్త చెప్పింది.

హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్‌ నేటి నుంచి అమలులోకి..
RTC Metro Common Pass

  • రూ.400 చెలిస్తే రోజంతా రెండు రవాణా వ్యవస్థల్లో ప్రయాణం

  • రూ.8,500 చెల్లిస్తే నెలవారీ పాస్‌ జారీ

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాలో సరికొత్త డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆర్టీసీ, మెట్రోకి సంబంధించిన ‘కామన్‌ మొబిలిటీ కార్డు’ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ నగరవాసులకు శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి ఆయా రవాణా వ్యవస్థలకు చెందిన ఉమ్మడి పాస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.


హైదరాబాద్‌ మహా నగరంలో ప్రజారవాణా ఆవశ్యకత రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్లపై పెద్ద ఎత్తున నిలిచిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే తక్కువ టికెట్‌ ధర కలిగిన ఆర్టీసీలో వివిధ అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇటు బస్సులు, అటు మెట్రోరైలులో తిరిగే తమకు ఒకే కార్డుతో సులువుగా రాకపోకలు సాగించే సౌకర్యాన్ని కల్పించాలని ప్రయాణికులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తద్వారా సమయం ఆదాతోపాటు ప్రయాణం ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు.


మీ టికెట్‌ యాప్‌ ప్రారంభం

ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా మీ టికెట్‌ యాప్‌ను కూడా ప్రారంభిస్తోంది. సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు కాగితపు టికెట్ల ఇబ్బందులు తప్పించేందుకు మీ టికెట్‌ యాప్‌ ద్వారా ఓపెన్‌ టికెటింగ్‌ విధానాన్ని తీసుకొస్తోంది.

డైనమిక్‌ క్యూఆర్‌ టికెట్‌

చెల్లింపు పూర్తయిన వెంటనే యాప్‌లో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ టికెట్‌ జనరేట్‌ అవుతుంది. ప్రయాణ సమయంలో దీనిని బస్సులో చూపిస్తే సరిపోతుంది. కాగా, కాగిత టికెట్ల అవసరం లేకుండా పూర్తి పేపర్‌లెస్‌ ప్రయాణం సాధ్యమవుతుంది. నగదు చిల్లర సమస్యలకు ఈ విధానం ముగింపు పలుకుతుంది.


city1.2.jpg

  • మీ టికెట్‌ యాప్‌-డిజిటల్‌ వీక్లీ బస్‌పాస్ రోజువారీ ప్రయాణికుల కోసం మీ టికెట్‌ యాప్‌లో ప్రత్యేకంగా డిజిటల్‌ వీక్లీ బస్‌ పాస్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో రూ.600 ధర ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రయాణికులు ఇకపై బస్‌ పాస్‌ సెంటర్లకు వెళ్లే అవసరం లేకుండా నేరుగా యాప్‌ నుంచే రూ.600 వారాంతపు పాస్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్‌ ద్వారా వారం రోజుల పాటు అన్ని బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేయవచ్చు.


ఉమ్మడి పాస్‌లోని ముఖ్యాంశాలు

  • ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఇస్తున్న పాస్‌ను అన్ని మెట్రో స్టేషన్లలో జారీచేస్తారు.

  • ఒకే పాస్‌తో ఓఆర్‌ఆర్‌ లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సుల్లో (పుష్పక్‌ మినహా), మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు.

  • మొదటిసారి కొనుగోలు చేసేటప్పుడు కార్డుకు రూ.100 వసూలు చేస్తారు. కార్డును తిరిగి ఇచ్చేటప్పుడు రూ.100 వాపస్‌ చేస్తారు.


ఉమ్మడి పాస్‌ అమలు ఇలా..

పాస్‌ రకం మెట్రో ఛార్జీ ఆర్టీసీ ఛార్జీ మొత్తం ఛార్జీ

రోజువారీ పాస్‌ రూ.300 రూ.100 రూ.400

నెలవారీ పాస్‌ రూ.7,000 రూ.1,500 రూ.8,500


ఈ వార్తలు కూడా చదవండి:

ఇన్‌స్టాలో పరిచయమైన బాలికపై అత్యాచారం

పెళ్లయ్యాక హనీమూన్‌ కోసం జపాన్‌కే వస్తా: ఇషాన్ కిషన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 07:19 AM