పెళ్లయ్యాక హనీమూన్ కోసం జపాన్‌కే వస్తా: ఇషాన్ కిషన్
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:49 AM
ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో ఏకంగా 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో ఏకంగా 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో స్వర్ణం కోసం తలపడనుంది. అయితే సెమీస్‌లో క్లిష్టమైన పిచ్‌పై ఇషాన్ కిషన్ 46 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఛేదనలో శ్రీలంక 45 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నిజం చెప్పాలంటే పిచ్ చాలా కఠినంగా ఉంది. క్రీజులోకి వచ్చినప్పుడు ఇక్కడ భారీ పరుగులు చేస్తాననే నమ్మకమే లేదు. అయితే మ్యాచ్‌కు ముందు మా టీమ్ మీటింగ్‌లో ఓ ప్రణాళిక రూపొందించుకున్నాం. క్రీజులో కుదురుకున్న బ్యాటర్ చివరి వరకు ఉండి వీలైనన్ని పరుగులు చేయాలని నిర్ణయించుకున్నాం. కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్ వెంటనే స్పిన్నర్లపై దాడి చేయడం అంత సులభమేమీ కాదు. అందుకే నేను చివరి వరకు నిలబడి జట్టుకు వీలైనన్నీ పరుగులు అందించడంపై దృష్టి పెట్టాను. ఈ పిచ్‌పై కనీసం 150 పరుగులు చేస్తేనే డిఫెండ్ చేసుకోవచ్చని భావించా. చివరకి 169 పరుగులు చేశాం. ఇలాంటి వికెట్లపై వ్యక్తిగత లక్ష్యాల కంటే జట్టు లక్ష్యాలే ముఖ్యం’ అని ఇషాన్ పేర్కొన్నాడు.
హనీమూన్‌కు వస్తా..
ఇక జపాన్‌లోని ప్రజలు చూపిస్తున్న ఆతిథ్యంపై ఇషాన్ కిషన్ ప్రశంసలు కురిపించాడు. భాష తెలియకపోయినా తమకు సహాయం చేసేందుకు స్థానికులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని చెప్పాడు. ‘జపాన్‌లో అనుభవం చాలా బాగుంది. ఇక్కడి ప్రజలు ఎంతో మంచివారు. భాషా సమస్య ఉన్నప్పటికీ మేం ఎక్కడికి వెళ్లాలన్నా స్థానికులు సహాయం చేస్తున్నారు. కొన్నిసార్లు అది వారి బాధ్యత కాకపోయినా కూడా మాకు సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. పెళ్లి చేసుకుని హనీమూన్‌కు ఇక్కడే వస్తా. ఆ తర్వాత ఫ్యామిలీతోనూ వచ్చి ఎంజాయ్ చేయాలని ఇప్పుడే నిర్ణయించుకున్నా’ అంటూ ఇషాన్ సరదాగా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం తర్వాత టీమిండియాకు భారీ షాక్..
ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. 8 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్‌కి పిలుపు