భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 25 , 2026 | 08:43 AM
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి 8,142 మంది పోలీసులతో 42 ప్లాటూన్లు విధుల్లో ఉన్నారు. మొత్తం బందోబస్తును 7 సెక్యూరిటీ జోన్లుగా పోలీసులు విభజించారు. చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్‌లో 4 RAF విభాగాలు ఉన్నాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లో 2 CRPF విభాగాలు విధుల్లో ఉన్నాయి.
భాగ్యనగరవ్యాప్తంగా 53 బాంబు డిటెక్షన్ టీమ్స్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు, షాపింగ్ మాల్స్, నగర ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు. మొజాంజాహీ మార్కెట్, బషీర్‌బాగ్ తదితర కీలక ప్రాంతాల్లో సీనియర్ పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు మహా శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర రూట్లలో 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. కెమెరాలన్నీ TGICCC కమాండ్ కంట్రోల్ రూమ్, బషీర్‌భాగ్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానం చేశారు. 24 అధునాతన డ్రోన్లతో శోభాయాత్రపై పోలీసులు నిరంతర నిఘా పెట్టారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ దాదాపు 100 హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రూఫ్‌టాప్‌లపై బైనాక్యులర్లు, వైర్‌లెస్ సెట్‌లతో పోలీసులు నిఘా ఉంచారు. ప్రధాన జలాశయాల వద్ద రెస్క్యూ బోట్లు, నిపుణులైన డైవర్లను సిద్ధం చేశారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి రేపు (శనివారం) ఉదయం 10 గంటల వరకు ప్రధాన శోభాయాత్ర మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశ్ శోభాయాత్రకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశ్‌ను సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలాపూర్ గణేశ్‌ను సుమారు 15 లక్షల మంది దర్శించుకున్నట్లు పోలీసులు అంచనా వేశారు. నిమజ్జనం రోజు భక్తులు భారీగా వచ్చే అవకాశం దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మహిళల భద్రత కోసం 26 SHE టీమ్స్ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నాయి. రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంచాయి. చైన్ స్నాచింగ్, దొంగతనాల నివారణకు ప్రత్యేక క్రైమ్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. నిమజ్జనం రోజు 139 CCS సిబ్బంది, 25 ప్లెయిన్‌క్లోత్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి పరిధుల నుంచి వచ్చే విగ్రహాలపై పోలీసులు ప్రత్యేక సమన్వయం చేసుకుంటున్నారు. స్థానిక చెరువులు, కుంటలు, బేబీ పాండ్స్ వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేశారు. ప్రధాన రూట్‌పై ఒత్తిడి తగ్గించేలా స్థానిక ఇమ్మర్షన్ పాయింట్లను వినియోగించనున్నారు. నిమజ్జన శోభాయాత్రలో డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్దం గల పరికరాలకు నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. బాణసంచాపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని పోలీసుల వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ
ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News