మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ మోసం.. సంచలన విషయాలు వెలుగులోకి..
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:11 PM
క్యూనెట్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్ సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): క్యూనెట్(Q NET) సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ (Hyderabad CP VC Sajjanar) వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్ సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈరోజు(సోమవారం) క్యూనెట్ కేసుకు సంబంధించి బషీర్‌బాగ్ సీసీఎస్‌లో సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.
వివిధ రకాల పేర్లతో మోసాలు..
1998 నుంచి క్యూనెట్ నిర్వాహకులు వివిధ రకాల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రొడక్ట్ ముందు చూపెడుతూ వెనకాల మోసం చేసి డబ్బులు దండుకోవడమే క్యూనెట్ సంస్థ నిర్వాహకుల టార్గెట్ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరంలో 22 మంది బాధితులు తెలిపిన వివరాల మేరకు కేసులు నమోదు చేశామని అన్నారు. క్యూనెట్ కీలక ఆధారాల కోసం 30 టీమ్‌లతో ఈ కేసును ఛేదించామని తెలిపారు. సిద్దిపేటలో హరికృష్ణ అనే బాధితుడు రూ.5 లక్షలు మోసపోయారని అన్నారు. హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యూనెట్ సంస్థ కార్యకలాపాలపై దృష్టిసారించామని చెప్పుకొచ్చారు. క్యూనెట్ సంస్థ చెప్పేది ఒక్కటని, చేసేది ఇంకొకటంటూ బాధితుడు సూసైడ్ నోట్ రాసి చనిపోయారని అన్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్..
వెల్‌నెస్ ప్రొడక్ట్స్, బిస్కెట్స్, హెల్త్‌ఫుడ్స్ తయారీ పేరిట ప్రజల్లోకి వెళ్తూ ట్రాప్‌లోకి దించుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ సంస్థలో చేరే వ్యక్తులకు ముందు ఇష్టపూర్వకంగా చేరుతున్నామని బాండ్ పేపర్లపై రాయించుకొన్న తర్వాతే ఈ సంస్థలోకి తీసుకుంటారని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వాళ్లకు ప్రొడక్ట్ చూపెట్టి సైడ్ ఇన్‌కమ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారన్నారు. ఉద్యోగస్థులు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్లే ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఇప్పించి అధికంగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు. నెలరోజులుగా క్యూనెట్ సంస్థపై దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించి అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 32 మంది నిందితులను అరెస్ట్ చేశామని.. 32 మందిలో 11 మంది మహిళలు ఉన్నారని ప్రస్తావించారు. చాలామంది ఇండియన్ డైరెక్ట్ సెల్లెర్స్‌గా ఏర్పడి బిజినెస్ చేస్తున్నారని అన్నారు. డైరెక్ట్ ప్రోడక్ట్ సెల్లింగ్ పేరుతో మనీ స్కాంలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన
బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
Read Latest Telangana News And AP News And International News And Telugu News