విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:24 PM
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఈ ఏడాది మే 7వ తేదీన విశాంత్ర ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా హత్య జరిగిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన 15 రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఈ ఏడాది మే 7వ తేదీన విశాంత్ర ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా హత్య జరిగిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన 15 రోజుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈరోజు (సోమవారం) ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే సునీల్, దిలీప్‌ను మొదటగా అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ కేసులో మే 19వ తేదీన స్పెషల్ సిట్ ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. సిట్ అధికారులు అనేక ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేశారని పేర్కొన్నారు.
నేపాల్‌కు మారువేషంలో వెళ్లిన సిట్ అధికారులు..
ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల పోలీసులతో సమన్వమం చేసుకున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. నేపాల్‌లోని నిందితుల దగ్గరకు మారువేషంలో వెళ్లి సిట్ అధికారులు చాలా రిస్క్ తీసుకున్నారని చెప్పారు. ఈ కేసులో నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. కల్పనా 10 నెలల నుంచి విశాంత్ర ఐపీఎస్ ఇంట్లో పని చేసిందని తెలిపారు. ఆమెనే ఈ కేసులో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఐపీఎస్ భార్య హత్య కోసం బెంగుళూరు, ముంబై నుంచి ఒక టీమ్ వచ్చిందని చెప్పారు. మొత్తం ఏడుగురు నిందితులు తనూజ హత్య కేసులో పాల్గొన్నారని అన్నారు. రెండు టీములుగా విడిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు. తనూజ నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్లు కట్టేశారని వెల్లడించారు. దీంతో ఊపిరి ఆడక తనూజ చనిపోయిందని.. చాలా కేసుల్లో ఈ నేపాలీలు నేరస్థులుగా ఉన్నారని ప్రస్తావించారు. కల్పనా, గణేశ్, చంద్ర బహుదూర్, గణేశ్ బహదూర్ షాహీలను ఇప్పుడు అరెస్ట్ చేశామని తెలిపారు.
నిందితులపై 5 నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌లు..
ఈ నిందితులపై 5 నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌లు పెట్టామని సీపీ సజ్జనార్ తెలిపారు. వీరిలో జీవన్ చంద్ అనే మరో నేపాలిని కూడా అరెస్ట్ చేశామని.. అతడిపై 8 కేసులు ఉన్నాయని అన్నారు. నేపాల్ వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి అడ్రసుతో ఆధార్ కార్డులు తయారు చేసుకుంటున్నారని తెలిపారు. వీరిని పనికి పెట్టుకుంటే నేపాల్ వెబ్‌సైట్‌లో వారి వివరాలు ఉన్నాయో, లేదో పరిశీలించాలని సూచించారు. ఇదే గ్యాంగ్ బెంగుళూరు, గుర్గావ్‌లో భారీ చోరీ చేసేందుకు ప్లాన్ చేసిందని వెల్లడించారు. ఈలోపే తాము పట్టుకున్నామని తెలిపారు. నేపాలీలు తక్కువ జీతానికే పని చేయడానికి వస్తున్నారని.. వారిని పనిలో పెట్టుకోవడం సరికాదని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
సైదాబాద్ హానీ ట్రాప్ కేసులో విచారణ కొనసాగుతుంది: సీపీ సజ్జనార్
సైదాబాద్ హానీ ట్రాప్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో వేలాది మందిని నిందితుడు పవన్ కుమార్ ట్రాపులోకి దించాడని అన్నారు. ఇందులో పోలీసులతో పాటు చాలా రంగాల్లో ఉండే వారు బాధితులుగా ఉన్నారని చెప్పారు. వేరే దేశాలకు చెందిన వారిని కూడా పవన్ సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేశాడని వెల్లడించారు. అతడిని కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. పురుషులను కూడా బెదిరించి పవన్ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా తాము గుర్తించామని చెప్పారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది: ఎంపీ రఘునందన్
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News