Share News

ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:00 PM

తాగునీటి కష్టాలు తలెత్తకుండా తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల
Telangana Minister Tummala Nageswara Rao

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తాగునీటి కష్టాలు తలెత్తకుండా తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. కుమ్మరి గూడెం వైపు ఒడ్డు నుంచి దుమ్ముగూడెం అవతల ఒడ్డుకు బోటులో చేరుకున్నారు. ఆనకట్టపైన ఒక మీటర్ ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఇసుక బస్తాల పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. సూపర్ ఎల్‌నినో ప్రపంచానికి విపత్తులా మారిందని వెల్లడించారు.


గోదావరి నీటిని నిల్వచేస్తున్నాం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి గండం లేకుండా గోదావరి నీటిని నిల్వచేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. దుమ్ముగూడెం ఆనకట్టపై మీటర్ ఎత్తున నీరు నిలిచేలా ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక టీఎంసీ నీళ్లు నిల్వ చేసేలా పనులు సాగుతున్నాయని అన్నారు. ఎగువ నుంచి వరద ఉధృతి ఉన్నా ఇసుక బస్తాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా దుమ్ముగూడెం వద్ద నీటి నిల్వ కోసం చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి‌కి తెలిపామని అన్నారు. తక్షణమే ఆయా పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.


ప్రజలు అసాధారణ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి..

ఎల్‌నినో ప్రభావంతో 0.5 డిగ్రీలు పెరిగితేనే ఎండలు భగ్గుమంటున్నాయని మంత్రి తుమ్మల చెప్పారు. పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలు చేరే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అసాధారణ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 07:17 PM