Share News

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో భారీ సైబర్ మోసం..

ABN , Publish Date - Jan 21 , 2026 | 08:33 AM

సాఫ్ట్‌వేర్, బిజినెస్ హబ్‌గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. అమెరికా స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో  భారీ సైబర్ మోసం..
Online Investment Fraud

హైదరాబాద్, జనవరి21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్, బిజినెస్ హబ్‌గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు (Online Investment Fraud) పోగొట్టుకున్నారు. తాను అమెరికా స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ మోసానికి పాల్పడ్డాడు. బాధితుడిని సంప్రదించడానికి నిందితుడు.. వాట్సాప్ (WhatsApp) వేదికను ఎంచుకున్నాడు. మోసం జరిగిన తీరు అచ్చం సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తోంది.


కోట్లు సంపాదించవచ్చని మోసం..

అమెరికాకు చెందిన స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకుని, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా కోట్లు సంపాదించవచ్చని బాధితుడిని మోసగాడు నమ్మించాడు. బాధితుడిని ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. అందులో న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NYSE) పేరుతో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసేవాడు. గ్రూప్‌లోని ఇతర సభ్యులకు (వీరు కూడా నిందితులకు సహకరించే వారే అయ్యుండొచ్చు) భారీ లాభాలు వచ్చినట్లు నకిలీ స్క్రీన్‌షాట్లు పంపి బాధితుడిరి నమ్మకాన్ని కలిగించాడు.


యాప్ ద్వారా మాయాజాలం..

పెట్టుబడి పెట్టడానికి నిందితుడు 'క్యాప్టో స్టోర్ ఇన్' (Capto Store In) అనే నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాడు. బాధితుడు మొదట పెట్టిన పెట్టుబడికి లాభం కింద రూ. 1.01 లక్షలు తిరిగి చెల్లించారు. దీంతో బాధితుడు ఇది నిజమైన సంస్థే అని నమ్మి భారీగా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. నిందితుడి మాటలు నమ్మిన బాధితుడు విడతల వారీగా మొత్తం రూ. 1.04 కోట్లు 'క్యాప్టో స్టోర్ ఇన్' యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేశాడు. ఈ యాప్‌లో బాధితుడి ఖాతాలో కోట్లలో లాభం కనిపిస్తున్నట్లు చూపించారు. కానీ, ఆ డబ్బును విత్‌డ్రా (Withdraw) చేసుకునే సదుపాయం కల్పించలేదు.


అసలు ప్లాన్ అమలు ఇలా..

బాధితుడు తన లాభాలను డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నిందితులు అసలు ప్లాన్ అమలు చేశారు. లాభాలు తీసుకోవాలంటే అదనంగా రూ. 49.39 లక్షలు పన్నులు, ఇతర ఛార్జీల కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే స్టాక్ మార్కెట్ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ కాలంలో రెట్టింపు లేదా భారీ లాభాలు ఇస్తామంటే అది కచ్చితంగా మోసమేనని బాధితులు గుర్తించాలని పేర్కొన్నారు. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో లేని అనధికారిక లింకుల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయొద్దని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.


పోలీసుల విచారణ..

బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలను, ఐపీ (IP) అడ్రస్‌లను ట్రాక్ చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. కొండాపూర్ వ్యాపారి ఉదంతం మనందరికీ ఒక హెచ్చరిక లాంటిదని చెప్పుకొచ్చారు. పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం శ్రేయస్కరమని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

హరీశ్‌రావును జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 08:58 AM