Share News

హైదరాబాద్‌లో కారు డ్రైవర్ రాక్షసత్వం.. ఓ వ్యక్తిని ఢీకొట్టి ఆపై..

ABN , Publish Date - May 03 , 2026 | 10:28 AM

భాగ్యనగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో కారు డ్రైవర్ రాక్షసత్వం.. ఓ వ్యక్తిని ఢీకొట్టి ఆపై..
Hyderabad Hit And Run Case

హైదరాబాద్, మే3 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో బాధితులు ఎస్.కె.జిలానీ, ఆయన కుమారుడు ఫైసల్ బైక్‌పై ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. అది కాస్తా తీవ్రమైంది.


సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డ్రైవర్ బాధితులకు సహాయం చేయాల్సి ఉండగా.. ఈ ఘటనలో మాత్రం డ్రైవర్ పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. తనతో గొడవ పడుతున్నారనే కోపంతో పరిస్థితిని అదుపులో పెట్టకుండా మరింత హింసాత్మకంగా మార్చాడా కారు డ్రైవర్. అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ అతణ్ని అడ్డుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఈ ఘటన మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. జిలానీ కారు బానెట్‌ను పట్టుకుని ఉండగా.. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. బాధితుడు నొప్పితో అరుస్తున్నా.. డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఈ దృశ్యాలు అక్కడి వాహనదారులను షాక్‌కు గురిచేశాయి.


ఈ దారుణాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, తిరిగి మందమల్లమ్మ జంక్షన్ సమీపానికి చేరుకుంది. అక్కడ స్థానికులు ధైర్యంగా ముందుకొచ్చి వాహనాన్ని అడ్డగించారు. అయితే డ్రైవర్ కారును అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో ఫైసల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని రెండు కాళ్లు విరిగిపోయినట్లు సమాచారం. వెంటనే బాధితుణ్ని సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈఘటనలో జిలానీకి కూడా గాయాలయ్యాయి.


సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్, వాహనం వివరాలు ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నగరంలో రోడ్డు భద్రతపై మళ్లీ పెద్ద చర్చకు దారితీసింది. హిట్ అండ్ రన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు

తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 03 , 2026 | 11:59 AM