HarishRao: కేసీఆర్‌పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:48 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రేవంత్‌రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శలు చేశారు.
హైదరాబాద్, జనవరి1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (HarishRao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రేవంత్‌రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శలు చేశారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్‌రెడ్డినేనని ఎద్దేవా చేశారు హరీశ్‌రావు.
నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్‌రెడ్డినే ఎంపిక చేస్తారని సెటైర్లు గుప్పించారు. ఈ మేరకు ఇవాళ(గురువారం) హరీశ్‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. బేసిన్లపై రేవంత్‌రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యమని ఆరోపించారు. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు కూడా తేడా తెలియదన విషయం వెల్లడైందని ఎద్దేవా చేశారు హరీశ్‌రావు.
బచావత్ ఎంత మదన పడేవారో..
‘పాపం కీర్తిశేషులైన బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడేవారోనని విమర్శించారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంత్‌రెడ్డి నైజం. అసెంబ్లీకి వస్తే కేసీఆర్‌ను అవమానించమని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్‌మీట్‌లో అర్ధం లేకుండా మాట్లాడుతావా. తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి.. కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారు. నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. నీకు తెలిసిందంతా అనాగరికమైన భాష, అభ్యంతరకరమైన పదజాలమే. కేసీఆర్‌ని, నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ.. మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తావా?. డొంక తిరుగుడు మాటలు తప్ప, పోలవరం నల్లమలసాగర్ విషయంలో నేను వేసిన ప్రశ్నకు ఎందుకు సూటిగా సమాధానం చెప్పలేదు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఢిల్లీ మీటింగ్‌కి ఎందుకు పోయావు..
‘నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజమైతే, ఢిల్లీ మీటింగ్‌కి ఎందుకు పోయావు... కమిటీ ఎందుకు వేశావు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచిపెట్టావ్?. కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడమే. కృష్ణాలో 763 టీఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని అసత్యాలు చెబుతున్నావ్. కేసీఆర్ 299కి ఒప్పుకున్నది నిజమైతే, మొత్తం 811 టీఎంసీలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రానికి వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారు? ఈరోజు నువ్వు కొత్తగా 71శాతం వాటా తెలంగాణకు రావాలని మాట్లాడావు. ఆనాడే కేసీఆర్ 811 టీఎంసీల్లో 69శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా? ఎందుకు ఈ నిజాన్ని దాచి పెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారు’ అని హరీశ్‌రావు నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్
For More TG News And Telugu News