Share News

రాధాగాయత్రి కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:37 PM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి ట్రిప్‌నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, రాధాగాయత్రి మృతిపై.. తన స్నేహితులు సంచలన విషయాలు వెల్లడించారు.

రాధాగాయత్రి కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు
Radha Gayathri Case

హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి ట్రిప్‌నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధాగాయత్రి మృతిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీచరణ్ కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఢిల్లీ వెళ్లక ముందు హైదరాబాద్‌లో ఆమె పని చేశారు. ఈనేపథ్యంలో రాధాగాయత్రి మృతిపై.. తన స్నేహితులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈరోజు (శనివారం) సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో ఆమెని భర్త మానసికంగా వేధింపులకు గురిచేశాడని మృతురాలి స్నేహితులు ఆరోపించారు.


రాధాగాయత్రి చాలా మంచి వ్యక్తి: స్నేహితురాలు చరిత

తనకు పదేళ్లుగా రాధాగాయత్రి తెలుసునని ఆమె స్నేహితురాలు చరిత తెలిపారు. రాధాగాయత్రి చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. చదువులో ఎప్పుడూ ముందు ఉండేదని.... ఎదుటి వారికి మంచి చేయాలనే మనస్తత్వం ఉందని పేర్కొన్నారు. ఆమె లేదనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. గత ఆరునెలలుగా రాధాగాయత్రి చాలా ఇబ్బందులకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయ్యాక గాయత్రిని శ్రీ చరణ్ ఎప్పుడూ అనుమానిస్తూనే ఉండేవాడని చెప్పారు. తను చెప్పిన విధంగా ఉండాలని.... ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అనుమానంతో వేధించేవాడని తెలిపారు. గాయత్రి సైకాలజీలో డిగ్రీ కూడా చదివిందని ప్రస్తావించారు. సైకలాజికల్ ఇబ్బందులతో శ్రీ చరణ్ బాధపడేవాడని ఆమె గుర్తించిందని అన్నారు. ఎన్నిసార్లు హింసించిన భర్త వేధింపులు తట్టుకునేదని.... శ్రీ చరణ్ ప్రవర్తనని మార్చాలనుకుని ప్రయత్నించేదని తెలిపారు. ఆమె చనిపోయిన సమయంలో శ్రీ చరణ్ ఏమి జరిగిందో ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదని స్నేహితురాలు చరిత ప్రశ్నించారు.


అవాస్తవాలను ప్రచారం చెయ్యొద్దు..

శ్రీ చరణ్ సైకో ప్రవర్తనతో ఉండేవాడని..... అదే విషయం గతంలో తమతో కూడా గాయత్రి చెప్పిందని ఆమె స్నేహితురాలు చరిత పేర్కొన్నారు. గాయత్రి మృతిపై మీడియాలో అనేక విధాలుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వాస్తవాలు బయటపడేవరకు అవాస్తవాలు ప్రచారం చెయ్యొద్దని కోరుకుంటున్నామని అన్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయం శ్రీ చరణ్ తల్లిదండ్రులకు తెలుసునని చెప్పుకొచ్చారు. గతంలో యూపీఎస్సీకి(UPSC) గాయత్రి ప్రిపేర్ అవుతానని అడగ్గానే ఆమె భర్త వ్యతిరేకించాడని అన్నారు. అత్తమామలు మాత్రం యూపీఎస్సీ ప్రిపరేషన్‌కి అనుమతి ఇచ్చారని తెలిపారు. పక్కా ప్రణాళికతోనే ముస్సోరికి తీసుకువెళ్లి గాయత్రిని శ్రీ చరణ్ చంపేశాడని ఆరోపించారు. శ్రీ చరణ్ అత్తమామల నుంచి గాయత్రికి ఎలాంటి వేధింపులు లేవని స్పష్టం చేశారు. శ్రీ చరణ్ వేధింపులతో మానసిక ఇబ్బందులకు గాయత్రి గురైందని చెప్పారు. గాయత్రి మృతిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు. శ్రీ చరణ్‌ను సమగ్రంగా విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆమె స్నేహితురాలు చరిత తెలిపారు.


జీపీఎస్ ట్రాకర్ పెట్టి గాయత్రిని వేధించాడు: స్నేహితురాలు రుక్మిణి

గాయత్రికి తెలియకుండా శ్రీ చరణ్ ఆమె బ్యాగ్‌లో జీపీఎస్ ట్రాకర్ పెట్టాడని గాయత్రి స్నేహితురాలు రుక్మిణి వెల్లడించారు. గాయత్రి ఎక్కడికి వెళ్లినా ట్రాకర్ ద్వారా కదలికలు తెలుసుకునేవాడని అన్నారు. జీపీఎస్ ట్రాకర్ గుర్తించి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భర్తపై కేసు పెడదామని గాయత్రి అనుకున్నారని తెలిపారు. సమాజంలో తల్లిదండ్రుల పరువు పోతుందని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని అన్నారు. పెళ్లి అయ్యాక చాలా ఇబ్బందులకు గురైందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌కి చెప్పి ఏదో విధంగా సీసీ పుటేజ్ వీడియోస్ తీసుకునేవాడని చెప్పుకొచ్చారు. ఆ వీడియోస్ చూపించి ఆమెని భర్త శ్రీ చరణ్ దారుణంగా వేధించేవాడని గాయత్రి స్నేహితురాలు రుక్మిణి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 07:08 PM