టాటా ప్రాజెక్టుతో బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:20 PM
టాటా ప్రాజెక్టుతో బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): టాటా ప్రాజెక్టుతో బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. అందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సచివాలయంలో TCS–హైపర్వాల్ట్ ప్రతినిధుల బృందంతో సీఎం ఈరోజు (శనివారం) సమావేశం అయ్యారు. దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనపై సీఎం చర్చించారు. హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో టీసీఎస్, హైపర్‌వాల్ట్, భాగస్వామ్య సంస్థలు కలిపి ఈ ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నాయి. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. టీసీఎస్ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
టాటా ప్రాజెక్టుతో నా కల నిజమైంది..
టాటా ప్రాజెక్టుతో తన కల నిజమైందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఇంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణకు ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను దావోస్‌లో కలిసి పెట్టుబడులు పెట్టాలని తాము కోరామని ప్రస్తావించారు. టాటా, టీసీఎస్, హైపర్ వాల్ట్ చేపట్టిన వన్ గిగావాట్ డేటా సెంటర్ రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో 7 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్డు వేస్తామని అన్నారు. ఆ రేడియల్ రోడ్డును భారతరత్న రతన్ టాటాకు అంకితం చేస్తామని తెలిపారు.
2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం..
గ్లోబల్ సమ్మిట్‌లో చెప్పినట్లుగానే తాము పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని ఉద్ఘాటించారు. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి తాము కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. ఏఐ అన్నింటినీ రీప్లేస్ చేస్తోందని.. కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ను రీప్లేస్ చేయదని చెప్పారు. 2037 వరకు తామే తెలంగాణలో అధికారంలో ఉంటామని వెల్లడించారు. 2028 జూన్ 2వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా టాటా సంస్థ కూడా ప్రయత్నాలు చేయాలని సూచించారు. టాటాకు అవసరమైన అన్ని సదుపాయాలు, అనుమతులు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News