Share News

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీపై చర్యలకు సిద్ధమవుతున్న మండలి చైర్మన్

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:55 AM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీపై చర్యలకు సిద్ధమవుతున్న మండలి చైర్మన్
BRS MLC Tata Madhu

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది. తాతా మధుపై చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సభ నుంచి తాతా మధును బహిష్కరించే యోచనలో మండలి చైర్మన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మధు వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను స్పీకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు.


తాతా మధుపై చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తాతా మధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి సుప్రీం స్పీకర్.. స్పీకర్‌ను ఎవరు తిట్టినా తప్పేనని చెప్పారు. స్పీకర్ సభకు అధిపతి అని.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అన్నారు. ఏమీ అనకపోయినా తనను, సంపత్‌ను సస్పెండ్ చేశారని తెలిపారు. స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడితే క్షమించకూడదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.


తాత మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి సీతక్క

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ధూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తాత మధును ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తక్షణం బహిష్కరించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.


తాత మధుపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ మల్లు రవి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధుపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఎస్సీ స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ విషయంపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాస్తానని అన్నారు. ఇవి దళితులపై జరుగుతున్న దాడులని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు స్పందించి పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు.


ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీరియస్

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నిరసనలో మధు అభ్యంతరకరంగా మాట్లాడటంపై ధ్వజమెత్తారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా.. చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.


దళితులను తాతా మధు అవమానించారు:అద్దంకి దయాకర్‌

దళితులను తాతా మధు అవమానించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవి నుంచి తాతా మధును తొలగించాలని డిమాండ్ చేశారు. దళితులంటే బీఆర్ఎస్‌కు చిన్నచూపు అని విమర్శించారు. ఆయన మాట్లాడిన మాటలను కేసీఆర్, కేటీఆర్‌పై వాడితే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. సభకు వచ్చి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.


స్పీకర్‌‌కు తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సమావేశం పెట్టి నేర్పించింది ఇదేనా? అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. స్పీకర్‌ని దూషించినందుకు తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ కావాలనే ఇలా మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందని ధ్వజమెత్తారు. తక్షణమే మధుపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే సభ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ నేతలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అసభ్య పదజాలం.. గులాబీ పార్టీ నేతలు వారసత్వంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మధు క్షమాపణ చెప్పకపోతే జరిగే పరిణామాలకు కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈహెచ్‌ఎస్‌ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క

అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్

త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 01:09 PM