Share News

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. బీఆర్ఎస్ క్యాంప్‌లో ఉత్కంఠ..

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:05 PM

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది..

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. బీఆర్ఎస్ క్యాంప్‌లో ఉత్కంఠ..
BRS

హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న అంశంపై పార్టీ అగ్రనాయకత్వం తర్జనభర్జన పడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నోటీసులపై చర్చించేందుకు పార్టీ కీలక నేతలు సిద్ధమవుతున్నారు.


ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ..

ప్రస్తుతం సిద్దిపేటలో హరీశ్‌రావు, సిరిసిల్లలో కేటీఆర్ పర్యటిస్తున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. కేసీఆర్‌తో భేటీ అయి.. సిట్ నోటీసులపై చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించనున్నారు. విచారణకు హాజరుకావాలా? లేక న్యాయ నిపుణుల సలహాతో గడువు కోరాలా? అనే దానిపై ఈరోజు సాయంత్రం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.


సమయం కోరే యోచనలో కేసీఆర్?

బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం, రేపు (జనవరి 30) మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన విచారణకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలోనూ కేసీఆర్ అదనపు సమయం కోరిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా సిట్ అధికారులకు లేఖ రాసి కొంత సమయం అడిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఉండటంతో, ఎన్నికలు ముగిసిన తర్వాతే విచారణకు హాజరుకావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


బీఆర్ఎస్ వాదన..

ఈ నోటీసులను బీఆర్ఎస్ నేతలు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.


ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలు..

  • కేసీఆర్ తన నివాసంలో విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

  • ఆరోగ్య కారణాలు లేదా రాజకీయ బిజీ షెడ్యూల్‌ను సాకుగా చూపి వాయిదా కోరతారా?

  • ఒకవేళ కేసీఆర్ గడువు కోరితే, సిట్ అధికారులు అందుకు అంగీకరిస్తారా? లేక తదుపరి చర్యలకు దిగుతారా?

  • మొత్తానికి, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగే సాయంత్రం భేటీ తర్వాతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పాత్ర, విచారణపై అసలు సస్పెన్స్ వీడనుంది.

  • ఈ భేటీ తర్వాత కేసీఆర్, కేటీఆర్ అధికారిక ప్రకటన విడుదల చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్‌

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కీలక నిబంధనలివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 05:41 PM